IIT Council: ఐఐటీలలో మానసిక ఆరోగ్య సలహాదారులు
భువనేశ్వర్‌లో నిర్వహించిన ఐఐటీ కౌన్సిల్ 55వ పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు, తీర్మానాలను చేసింది. కౌన్సెలర్ల నియామకంతో పాటు ఐఐటీలలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని 1:20 నుంచి 1:10కి మార్పు చేయాలని తీర్మానించింది. దీనివల్ల విద్యార్థులపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించడానికి వీలుంటుందని సమావేశం అభిప్రాయపడింది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సరైన ‘గ్రీవెన్స్ రిడ్రస్సెల్’ విధానం అమలు చేయాలని.. తద్వారా విద్యార్థులలో ఒత్తిడి తగ్గించేందుకు వీలవుతుందని కౌన్సిల్ పేర్కొంది.
చదవండి: ‘డ్రోన్ల’పై స్వల్పకాలిక కోర్సులు ఇవే..
ముఖ్యంగా విద్యార్థుల్లో ఫెయిల్, తిరస్కరణ వంటి భయాలు ఎక్కువగా ఉంటాయని, వాటిని పోగొట్టాల్సిన అవసరముంటుందని వివరించింది. ముఖ్యంగా ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో విద్యార్ధులలో వివక్షా వాతావరణం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. దీనికి సంబంధించి కమిటీలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది. అలాగే విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై ఎస్‌ఓపీ రూపొందించనున్నారు. రానున్న 25 ఏళ్లలో ఐఐటీలలో చేపట్టాల్సిన మార్పులపై సమావేశం చర్చించింది. ముఖ్యంగా ఐఐటీ విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్, విదేశీ అధ్యాపకుల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు.
చదవండి: ‘అష్ట’కష్టాల్లో 8 ఐఐటీలు!