Skip to main content

దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ పూర్తయిన విద్యార్ధులకు ఉద్యోగాలు ఎందుకు రావడంలేదో తెలుసా..

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా మెజారిటీ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పరిశోధనలు జరగడం లేదు. ఎలాంటి కొత్త ఆవిష్కరణలూ రావడం లేదు.
రీసెర్చ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం మొత్తుకుంటున్నా కూడా.. కాలేజీలు ఉన్న సిలబస్‌నే బట్టీకొట్టిస్తూ నడిపించేస్తున్నాయి. ఏదో నామమాత్రంగా సాధారణ చదువులకే పరిమితం అవుతున్నాయి. దీంతో ఇంజనీరింగ్‌ చదువు పూర్తిచేస్తున్న చాలా మందికి ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా మొత్తం 10,989 ఇంజనీరింగ్‌ కాలేజీలుంటే అందులో కేవలం 907 కాలేజీల్లో (8.25 శాతం) మాత్రమే పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక స్టార్టప్‌ పాలసీని అమలు చేస్తున్న కాలేజీలు 17 శాతానికి మించి లేవు. ఇలాంటి పరిస్థితుల కారణంగానే ఇంజనీరింగ్‌ చదువుతున్న విద్యార్థుల్లో 57 శాతం మందికి ఉద్యోగాలు లభించడం లేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) తమ నివేదికలో వెల్లడించింది. కేవలం 43 శాతం మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్టు పేర్కొంది.

హాజరు మినహాయింపు...
పరిశోధన, స్టార్టప్‌లను ప్రోత్స హించడం ద్వారా విద్యార్థులు సొంతంగా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని, మెరుగైన ఉద్యోగావకాశాలైనా లభిస్తాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా చెబుతున్నాయి. కానీ దీనిని అందిపుచ్చుకోవడంలో విద్యా సంస్థలు విఫలం అవుతున్నాయి. తెలంగాణలో కూడా 5– 10 శాతం విద్యా సంస్థల్లోనే స్టార్టప్‌ పాలసీ అమలవుతోంది. స్టార్టప్‌లపై పనిచేసే విద్యార్థులకు 10 శాతానికిపైగా హాజరు మినహాయింపు ఇచ్చినా.. కాలేజీలు ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించడంలో వెనుకబడే ఉన్నాయి. 2019–20లో దేశవ్యాప్తంగా 10,989 ఇంజనీరింగ్‌ కాలేజీలు కొనసాగగా.. ఇందులో స్టార్టప్‌లకు అవసరమైన సదుపాయాలు ఉన్నవి 2013 మాత్రమే. వీటిలోనూ 1,869 కాలేజీల్లో మాత్రమే స్టార్టప్‌ పాలసీ అమలవుతోంది. వీటన్నింటిలో కలిపి 6,021 స్టార్టప్‌లు కొనసాగుతున్నాయని ఏఐసీటీఈ గుర్తించింది. ఇక 907 కాలేజీల్లో (8.25 శాతం) మాత్రమే పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నట్లు తెలిపింది.

రాష్ట్ర సర్కారు చెబుతున్నా..
రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పరిశోధనలు, స్టార్టప్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా.. కాలేజీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. పేరున్న టాప్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు కూడా పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో వెనుకబడే ఉన్నాయి. 5 –10 శాతం కాలేజీలు మినహా మిగతా ఇంజనీరింగ్‌ కాలేజీలన్నింటిలో 95 శాతం ఫ్యాకల్టీని కేవలం బోధనకే పరిమితం చేస్తున్నారు. పరిశోధనలు, స్టార్టప్‌లను ప్రోత్సహించాలంటే సమయంతోపాటు ఆర్థిక తోడ్పాటు కూడా అవసరం. ఆ దిశగా కాలేజీలు చర్యలు చేపట్టడం లేదు. మెజారిటీ విద్యార్థులు తమకు ఎన్నో ఆలోచనలు ఉన్నా ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నారు.

5 వేల స్టార్టప్‌లు లక్ష్యంగా పాలసీ
రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌ పాలసీని తీసుకువచ్చినా.. ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించడంలో కాలేజీలు వెనుకంజలో ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని రాష్ట్ర విద్యా సంస్థలు కాకుండా జాతీయ స్థాయి సంస్థల్లో మాత్రం పరిశోధనలు, స్టార్టప్‌లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇక ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలు మినహా మిగతా రంగాల్లోని ప్రైవేటు సంస్థలు పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇచ్చి ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేశాయి. జేఎన్టీయూ, ఉస్మానియా వర్సిటీ, అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో మాత్రం వీహబ్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసింది. వాటి పరిధిలోని కాలేజీల విద్యార్థులు కొద్దిమంది మాత్రం తమ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ఇంక్యుబేటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇంజనీరింగ్‌ విద్యాసంస్థలు పరిశోధనలు, స్టార్టప్‌లకు ప్రాధాన్యం ఇవ్వకపోయినా.. రాష్ట్ర సర్కారు మాత్రం స్టార్టప్‌లను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు మంత్రి కేటీఆర్‌ చొరవతో 5 వేల స్టార్టప్‌లు లక్ష్యంగా రాష్ట్ర ఐటీ శాఖ కసరత్తు చేస్తోంది.

దేశంలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో స్టార్టప్‌లు, పరిశోధనలు, ఉద్యోగాల పరిస్థితి ఇదీ..

సంవత్సరం

2016–17

2017–18

2018–19

2019–20

విద్యాసంస్థలు

10,363

10,400

10413

10,989

స్టార్టప్‌ పాలసీ ఉన్న కాలేజీలు

566

1,123

1,564

1,869

స్టార్టప్‌ సదుపాయాలున్నవి

839

1,473

1,670

2,013

స్టార్టప్‌ల సంఖ్య

3,537

5,099

5,439

6,021

పాలసీ అమలు కాలేజీల శాతం

5.46

10.79

15.01

17

ఆర్‌అండ్‌ డీ సెంటర్లున్నవి

822

840

890

907

పీహెచ్‌డీలు చేసినవారు

2,002

2,120

2,360

2,468

పబ్లికేష¯న్స్

3,860

4,366

5,076

5,378

ఆర్‌ అండ్‌ డీ సెంటర్ల శాతం

7.93

8.07

8.54

8.25

ఇంజనీరింగ్‌ పాసైనవారు

17,12,269

15,71,288

15,49,810

15,22,856

ఉద్యోగాలు పొందినవారు

7,21,785

7,15,793

7,95,090

7,78,416

ఉద్యోగాలు వచ్చినవారి శాతం

36.96

37.77

42.82

41.95

Published date : 12 Mar 2021 04:07PM

Photo Stories