Skip to main content

Engineering Counselling: ఇంజనీరింగ్‌ స్లైడింగ్‌ సీట్ల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అంతర్గత స్లైడింగ్‌కు సంబంధించిన సీట్ల కేటాయింపు ఆగ‌స్టు 24న‌ సాంకేతిక విద్య విభాగం వెల్లడించనుంది.
Allotment of engineering sliding seats

దీని తర్వాత అన్ని కాలేజీల్లోనూ స్పాట్‌ అడ్మిషన్లు జరగనున్నాయి. ఈ నెలాఖరుకు ఇది కూడా ముగుస్తుంది. ఈనెల 31 నుంచి అన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. మరోవైపు యాజమాన్య కోటా కింద కాలేజీలు భర్తీ చేసిన సీట్లకు ర్యాటిఫికేషన్‌ ప్రక్రియను ఉన్నత విద్యా మండలి చేపడుతుంది.

నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించారా? లేదా? అన్నది మండలి అధికారులు పరిశీలిస్తారు. అయితే ర్యాటిఫికేషన్‌ చేపడుతుండగానే ఇంజనీరింగ్‌ క్లాసులూ జరుగుతాయి. ముందుగా ఓరియంటేషన్‌ క్లాసులు నిర్వహిస్తారు.

చదవండి: B Tech Computer Science Course : ఇంజినీరింగ్‌లో కంప్యూట‌ర్ సైన్స్‌కే విద్యార్థుల ఓటు.. ఇందుకేనా..!

విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే చర్యలు, మాదక ద్రవ్యాల వినియోగం జోలికెళ్తే వచ్చే సమస్యలపై అవగాహన కల్పించాలని అధికారులు ఆదేశించారు. కాగా, ఈసారి స్లైడింగ్‌కు అత్యధికంగా 10 వేల దరఖాస్తులు అందాయి.

విద్యార్థులు తాము సీటు పొందిన కాలేజీల్లోనే ఈ తరహా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు ఇతర బ్రాంచీల్లో సీట్లు వచ్చిన వారు చేరకపోవడం, మరికొందరు ఇతర కాలేజీల్లో సీట్లు వస్తే వెళ్లడంతో ఈ సీట్లు ఖాళీ అయ్యాయి. తుది దశలో కేటాయించని 5 వేల సీట్లు కలుపుకుని, సీట్లు వచ్చినా చేరకపోవడంతో ఏర్పడ్డ మొత్తం ఖాళీ సీట్లు 11,836 ఉన్నాయి.

అయితే, ర్యాంకుల ప్రకారం సీట్లు కేటాయిస్తే అంతిమంగా 3 వేల సీట్లు భర్తీ అయ్యే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఇంకా 8 వేలకుపైగా సీట్లు మిగిలే వీలుంది. వీటికి ఆయా కాలేజీలు స్పాట్‌ అడ్మిషన్లు చేపడతాయి. రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్‌ కోటా కింద 86,943 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Published date : 24 Aug 2024 12:08PM

Photo Stories