TS EDCET 2024: నేడు ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష.. రెండు సెషన్లలో ఎగ్జామ్
నల్లగొండ రూరల్: రెండు సంవత్సరాల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకోసం గురువారం నిర్వహించే తెలంగాణ ఎడ్‌సెట్–2024కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎడ్‌సెట్ కన్వినర్ ఆచార్య తాళ్ల మృణాళిని తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
మొదటి సెషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని తెలిపారు. మొదటి సెషన్‌లో 16,929 మంది, రెండో సెషన్‌లో 16,950 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్టు పేర్కొన్నారు.
ఆ సమయం దాటితే అనుమతించరు..
తెలంగాణ వ్యాప్తంగా 79 పరీక్ష కేంద్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూల్, విజయవాడ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://edcet.tsche.ac.in వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మొదటి సెషన్ పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకల్లా, రెండో సెషన్ పరీక్షకు హాజరయ్యేవారు మధ్యాహ్నం 12:30 కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
ఉదయం పరీక్ష కేంద్రాలకు 10 గంటల తర్వాత, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోరని తెలియజేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రెండోసారి ఎడ్‌సెట్ నిర్వహిస్తున్నట్లు ఎడ్‌సెట్ చైర్మన్ ఆచార్య గోపాల్‌రెడ్డి తెలిపారు.