EAMCET 2023: జనవరిలో ఎంసెట్ నోటిఫికేషన్!.. విద్యార్హతల్లో మార్పులు?
2023 జనవరిలో పరీక్షల తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికోసం మండలి అధికారులు త్వరలో సమావేశం కానున్నారు. సాధ్యమైనంత వరకు ఎంసెట్ పరీక్ష మే రెండు, మూడు వారాల్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్ సన్నద్ధతకు కనీసం 45 రోజుల కాలపరిమితి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ లెక్కన మేలో ఎంసెట్‌కు అనువైన తేదీలను ఖరారు చేసే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
జేఈఈ మెయిన్స్ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు జరుగుతాయి. రెండో విడత ఏప్రిల్ 6 నుంచి 12 వరకు ఉంటుంది. జేఈఈ పూర్తయిన తర్వాత కూడా ఎంసెట్‌కు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులకు సమయం దొరుకుతుంది. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా ఎంసెట్ ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సకాలంలో విద్యా సంవత్సరం కొనసాగింది. దీంతో జేఈఈ మెయిన్స్ కూడా గతం కన్నా ముందే పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ను త్వరగా నిర్వహించి జూన్‌లో ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆగస్టు చివరి నాటికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగించాలని యోచిస్తున్నారు. ఈసారి కూడా ఇంటర్ మార్కుల వెయిటేజీ లేనట్టేనని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు.
Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS
మేలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత నెల రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన వారికి, మార్కులు తక్కువగా వచి్చనవారికి మేలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఫలితాలు ప్రకటించిన రోజే ఆయా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అడ్వాన్స్‌డ్ పరీక్షలు రాసే వారు కూడా ఎంసెట్ పరీక్షలు రాసేందుకు అర్హులే.
ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలు
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా, పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ మొదటివారంలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చిలోనే ముగియనుండగా, ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలను ప్రారంభించాలని ఎస్సెస్సీబోర్డు అధికారులు భావిస్తున్నారు. 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించగా, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీవోను ప్రభుత్వం జారీచేయాల్సి ఉంది. ఈ జీవో జారీ అయితేనే తుది షెడ్యూల్ ఖరారుచేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఎంసెట్ విద్యార్హతల్లో మార్పులు?
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ అర్హత సబ్జెక్టుల్లో మార్పు చేసే అంశాన్ని Telangana State Council of Higher Education (TSCHE) పరిశీలిస్తోంది.
ఈ దిశగా అధ్యయనానికి ముగ్గురు సభ్యులతో డిసెంబర్ 1న ఓ కమిటీని నియమించింది. ఏఐసీటీఈ కొన్ని ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది. ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందేవారు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఈ విధానానికి బదులుగా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను తప్పనిసరి చేసి, కెమిస్ట్రీ స్థానంలో ఏ ఇతర సబ్జెక్టు చదివి ఉన్నా.. ఎంసెట్ పరీక్ష రాసి, ఇంజనీరింగ్‌లో చేరేందుకు అర్హత కల్పించాలని సూచించింది.
ఉదాహరణకు ఓ విద్యార్థి ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కంప్యూటర్స్ చేసి ఉంటే అతనికి ఎంసెట్ రాసే అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఇంటర్‌లో మొత్తం 14 సబ్జెక్టుల్లో దేన్ని పూర్తి చేసినా ఎంసెట్‌కు అర్హత ఇవ్వాలని పేర్కొంది. మూడో సబ్జెక్టు ఏదైనప్పటికీ.. మ్యాథ్స్, ఫిజిక్స్ మాత్రం తప్పనిసరి చేసింది. కాగా, ఏఐసీటీఈ మార్గదర్శకాలకనుగుణంగా రాష్ట్రంలో అమలు చేయడం సాధ్యమా? లేదా? అనే విషయంలో కమిటీ అధ్యయనం చేసి, ఉన్నత విద్యామండలికి నివేదిక ఇవ్వనుంది.
మ్యాథ్స్, ఫిజిక్స్‌తో మరేదైనా సబ్జెక్టు 14 సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం రాష్ట్రంలో సాధ్యాసాధ్యాలపై కమిటీ నియామకం.