15న తెలంగాణ ఎంసెట్ యథాతథం
Sakshi Education
కేయూ క్యాంపస్: ఎంసెట్- 2016 యథాతథంగా ఈనెల 15న నిర్వహించనున్నామని, మెడిసిన్ ప్రవేశాల కోసం కూడా దరఖాస్తులు చేసిన అభ్యర్థులు పరీక్ష రాయవచ్చని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి తెలిపారు.
మెడిసిన్‌లో ప్రవేశాల కోసం నేషనల్ ఎల్జిబులిటీ టెస్ట్(నీట్)రాసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణపై విలేకరులు ప్రశ్నించగా, ఆయన ఈ విధంగా స్పందించారు. మెడిసిన్‌లో ప్రవేశాలకు నీట్ రాసుకోవాలనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన అంశాలపై ప్రభుత్వం న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 371 ఆర్టికల్ ప్రకారంగా ఎంసెట్‌లో మెడిసిన్ నిర్వహణకు ప్రత్యేకంగా ఏమైనా అవకాశాలున్నాయూ? అన్న అంశంపై న్యాయపరంగా పరిశీలన జరుగుతోందన్నారు. ఎంసెట్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉదయం పరీక్ష ఉంటుందని, అలాగే మెడిసిన్ దాని అనుబంధ అభ్యర్థులకు మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం 5-30 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. మెడిసిన్ అభ్యర్థులు కూడా రాయవచ్చా.. అని ప్రశ్నిస్తే ఎలాగో అభ్యర్థులు ప్రిపేర్ అయినందున మెడిసిన్ అభ్యర్థులు కూడా రాసుకోవచ్చన్నారు. నీట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎంసెట్ మెడిసిన్ ప్రవేశాలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
Published date : 11 May 2016 01:46PM