ఏఎన్‌యూ దూరవిద్యకు యూజీసీడెబ్ గుర్తింపు
Sakshi Education
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) దూరవిద్యకు న్యూఢిల్లీకి చెందిన యూజీసీ డెబ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో) గుర్తింపునిచ్చింది.
గుంటూరు సమీపంలోని ఏఎన్‌యూ దూరవిద్యా కేంద్రం ద్వారా 30 డిగ్రీ, పీజీ కోర్సులను 2020 వరకు నిర్వహించుకునేందుకు అనుమతి, గుర్తింపునిస్తూ యూజీసీ డెబ్ విభాగం సెక్రటరీ ప్రొఫెసర్ రజనీష్ జైన్ వర్సిటీకి లేఖ పంపారు. దూర విద్యా కేంద్రానికి డెబ్ అనుమతి కోరుతూ ఏఎన్‌యూ దూరవిద్యా కేంద్రం ప్రతినిధి బృందం జూలై 5న న్యూఢిల్లీ యూజీసీ డెబ్ విభాగంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగా దూరవిద్యా కేంద్రాన్ని సందర్శించి అన్ని వసతులు పరిశీలించి అనుమతి ఇస్తామని డెబ్ చెప్పింది. యూజీసీ బృందం సందర్శన కోసం దూరవిద్యా కేంద్రం సిద్ధమవుతుండగానే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లోని అంశాలపై సంతృప్తి చెందిన యూజీసీ ఏఎన్‌యూ దూరవిద్యా కేంద్రానికి అనుమతినిస్తూ డెబ్ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 53 వర్సిటీలకు మాత్రమే యూజీసీ డెబ్ దూర విద్యా కేంద్రం నిర్వహణకు అనుమతినిచ్చింది. వాటిలో జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ మొదటి స్థానంలో నిలవగా ఆచార్య ఏఎన్‌యూ దూరవిద్యా కేంద్రం రెండో స్థానాన్ని సాధించింది. ఏఎన్‌యూ దూరవిద్యా కేంద్రం నిర్వహిస్తున్న కోర్సులు, విద్యార్థులకు అందిస్తున్న సేవలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, దూరవిద్యా కేంద్రంలో వసతులు తదితర అంశాల ఆధారంగా డెబ్ ఏఎన్‌యూకి రెండో స్థానాన్ని కేటాయించింది.
Published date : 11 Aug 2018 05:00PM