ఏఎన్‌యూ దూరవిద్య డిగ్రీలు చెల్లుబాటవుతాయి
Sakshi Education
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం ద్వారా వివిధ కోర్సులు చదివిన తెలంగాణ విద్యార్థులు పొందిన డిగ్రీలు చెల్లుబాటవుతాయని దూరవిద్యాకేంద్రం డెరైక్టర్ ఆచార్య పి.శంకరపిచ్చయ్య తెలిపారు.
ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్రం ద్వారా తెలంగాణలోని అధ్యయన కేంద్రాల్లో 2013 తరువాత కోర్సులు చదివిన విద్యార్థులు పొందిన డిగ్రీలు చెల్లుబాటు కావని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపినట్టుగా జనవరి 27న పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. భారత రాజ్యాంగంలోని 371-డి అధికరణం ప్రకారం రాష్ట్ర విభజన తరువాత కూడా రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులు జూన్ 2024 వరకు ఎక్కడైనా విద్యావకాశాలు పొందవచ్చని భారత ప్రభుత్వం జారీ చేసిన రాజపత్రంలో పేర్కొందని తెలిపారు. దీని ప్రకారం 2024 వరకు తెలంగాణలో ఏఎన్‌యూ అధ్యయన కేంద్రాలు నిర్వహించడం చట్టబద్ధమేనని, డిగ్రీలు కూడా చట్టబద్ధమేనని స్పష్టం చేశారు. విద్యార్థులెవరూ ఆందోళన, అపోహలకు గురికావద్దని సూచించారు.
Published date : 29 Jan 2018 02:27PM