టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లి గుడ్‌బై.. బీసీసీఐ స్పందన ఇదే..
ఈ సందర్భంగా 7 ఏళ్ల కెప్టెన్సీ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్‌గా అవకాశం ఇచ్చిన బీసీసీఐకి సైతం థ్యాంక్స్ చెప్పాడు.‘నాకు అండగా నిలిచిన రవిశాస్త్రికి, ధోనికి ధన్యవాదాలు.ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. కెప్టెన్సీ వదులుకునేందుకు ఇదే సరైన సమయం. కెప్టెన్సీ ఎప్పటికైనా వదులుకోక తప్పదు. కెప్టెన్సీ అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు’ అని ట్వీటర్ అకౌంట్‌లో పేర్కొన్నాడు. కాగా, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన మరుసటి రోజే కోహ్లి సంచలన నిర్ణయం తీసుకోవడం క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. కాగా, కోహ్లి.. ఇటీవలే వన్డే, టీ20 సారధ్య బాధ్యతలను కూడా వదులుకున్న సంగతి తెలిసిందే.
బీసీసీఐ స్పందన ఇదే..
టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ విరాట్ కోహ్లి తీసుకున్న సంచలన నిర్ణయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) స్పందించింది. కోహ్లి నిర్ణయాన్ని స్వాగతించిన బీసీసీఐ.. అతనికి అభినందనలు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా.. కోహ్లి నిర్ణయం తర్వాత స్పందించారు.
‘టీమిండియా కెప్టెన్‌గా జట్టును ఉన్నతస్థాయికి తీసుకెళ్లావు. స్వదేశంలోనూ , విదేశాల్లోనూ నీ కెప్టెన్సీలో భారత జట్టు బలమైన శక్తిగా ఎదిగింది. ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో నీ సారథ్యంలో సాధించిన విజయాలు ప్రత్యేకం. ఎప్పటికీ మరువలేనివి’ అని జై షా పేర్కొన్నారు.మరొకవైపు కోహ్లి ఆకస్మిక నిర్ణయంపై బీసీసీఐ తన ట్వీటర్ అకౌంట్‌లో స్పందించింది. కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు ఎన్నో మైలురాళ్లను అధిగమించడమే కాకుండా, అత్యున్నత స్థాయికి వెళ్లిందని పేర్కొంది. టెస్టుల్లో భారత్ తరఫున 68 మ్యాచ్‌లకు కోహ్లి నేతృత్వం వహించగా 40 విజయాలను సాధించిన విషయాన్ని బీసీసీఐ గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది.
కెప్టెన్ హోదాలో
జట్టును సరైన దిశలో నడిపించేందుకు తన వంతు పూర్తి సహకారాన్ని అందించానన్న కోహ్లి.. తన ఏడేళ్ల టెస్ట్ కెప్టెన్సీ కెరీర్‌లో వందకు 120 శాతం కష్టపడ్డానని, అలా చేయలేని పక్షంలో కెప్టెన్ హోదాలో కొనసాగడం కరెక్ట్ కాదని భావిస్తున్నానని అన్నాడు. ఆశించిన ఫలితాలు రాకపోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపాడు. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. జట్టు కోసం నిజాయితీగా కష్టపడ్డానని, జట్టుకు కరెక్ట్ కానిది తాను ఎట్టి పరిస్థితుల్లో చేయలేనని, తన నిర్ణయంపై పూర్తి క్లారిటీతో ఉన్నానని లేఖలో పేర్కొన్నాడు. తన ప్రయాణంలో తోడుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ ధోనిల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు.