IPL Auction 2023: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ గుర్తింపు
పంజాబ్ కింగ్స్ టీమ్ అతడిని ఏకంగా రూ. 18 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో ఒక ఆటగాడికి పలికిన అత్యధిక ధర ఇదే. ఇప్పటి వరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ (2021లో రాజస్తాన్ రాయల్స్ రూ.16 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది) పేరిట ఉంది. వేలంలో మాత్రమే కాకుండా ఓవరాల్‌గా కూడా కరన్‌దే ఎక్కువ మొత్తం కావడం విశేషం. కోహ్లిని రీటెయిన్ చేసుకున్నప్పుడు కూడా బెంగళూరు.. కేఎల్ రాహుల్ కోసం లక్నో గరిష్టంగా రూ.17 కోట్లు చెల్లించాయి.
2019 ఐపీఎల్‌లో పంజాబ్ జట్టే కరన్‌కు రూ.7 కోట్ల 20 లక్షలు చెల్లించింది. తర్వాతి రెండు సీజన్లు చెన్నైకి ఆడిన అతను గాయంతో గత సీజన్‌కు దూరమయ్యాడు. ఓవరాల్‌గా 32 ఐపీఎల్ మ్యాచ్‌లలో 9.21 ఎకానమీతో 32 వికెట్లు తీసిన కరన్.. 149.77 స్ట్రయిక్‌రేట్‌తో 337 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్, ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడైన బెన్ స్టోక్స్ రూ.16 కోట్ల 25 లక్షలకు చెన్నై జట్టులోకి చేరాడు. వేలంలో చెన్నై తరఫున అత్యధిక విలువ పలికిన ఆటగాడిగా దీపక్ చహర్ (రూ. 16 కోట్లు) రికార్డును స్టోక్స్ సవరించాడు. ఆ్రస్టేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కోసం ముంబై ఇండియన్స్ భారీ మొత్తం (రూ.17.5 కోట్లు) చెల్లించింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను రూ.13 కోట్ల 25 లక్షలు పెట్టి సన్‌రైజర్స్ ఎంచుకుంది.
వేలం ఇతర విశేషాలు
☛ అందరికంటే ముందుగా విలియమ్సన్ పేరు రాగా సన్‌రైజర్స్ పట్టించుకోలేదు. గుజరాత్ రూ.2 కోట్లకు విలియమ్సన్‌ను తీసుకుంది. స్వదేశీ ఓపెనర్ అవసరం ఉన్న సన్‌రైజర్స్.. చెన్నైతో చివరి వరకు పోటీ పడి మయాంక్ అగర్వాల్‌ను రూ.8 కోట్ల 25 లక్షలకు తీసుకుంది. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజాకు తొలి అవకాశం దక్కింది. పంజాబ్ కింగ్స్ రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది.
☛ ఆంధ్ర యువ క్రికెటర్ షేక్ రషీద్‌ను రూ.20 లక్షలకు చెన్నై దక్కించుకుంది. ఆంధ్ర కీపర్ కోన శ్రీకర్ భరత్‌ను గుజరాత్ రూ.కోటీ 20 లక్షలకు తీసుకుంది. హైదరాబాద్ యువ ఆటగాడు భగత్ వర్మను రూ. 20 లక్షలకు చెన్నై.. ఆంధ్ర ప్లేయర్ నితీశ్ రెడ్డిని రూ.20 లక్షలకు సన్‌రైజర్స్ ఎంచుకున్నాయి. ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్‌ను రూ.4 కోట్ల 40 లక్షలకు గుజరాత్ తీసుకుంది. ఐపీఎల్ ఆడ నున్న తొలి ఐర్లాండ్ ప్లేయర్‌గా లిటిల్ ఘనత వహిస్తాడు.