Skip to main content

సెప్టెంబర్ 2019 అవార్డ్స్

గ్రెటా థెన్‌బర్గ్‌కు రైట్ లైవ్‌లీహుడ్ అవార్డు
Current Affairs పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ‘రైట్ టు లైవ్‌లీహుడ్’ అవార్డుకు ఎంపికైంది. థన్‌బర్గ్‌తోపాటు అమీనాటౌ హౌదర్(మొరాకో), గువో జియాన్మీ(చైనా), డేవి కోపెనావా(బ్రెజిల్) ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అవార్డు కమిటీ సెప్టెంబర్ 26న వెల్లడించింది. స్వీడెన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో డిసెంబర్ 4న జరిగే కార్యక్రమంలో వీరికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
  • అమీనాటౌ హౌదర్ : మొరాకో నుంచి ‘వెస్ట్రన్ సహారా’ప్రాంతానికి స్వాతంత్య్రం కోరుతూ అహింసాయుత పోరాటం చేస్తూ ‘గాంధీ ఆఫ్ వెస్ట్రన్ సహారా’గా అమీనాటౌ హౌదర్ పిలవబడుతున్నాడు.
  • గువో జియాన్మీ : న్యాయవాది అయిన గువో జియాన్మీ చైనాలో మహిళల గృహహింసపై పోరాడుతున్నారు.
  • డేవి కోపెనావా : అమెజాన్ అడవిని, అక్కడి ప్రజలను రక్షించడంలో చేస్తున్న కృషికిగాను బ్రెజిల్ దేశీయ తెగకు చెందిన న్యాయవాది డేవి కోపెనావా, హుటుకారా యనోమామి అసోసియేషన్ (బ్రెజిల్) సంస్థకు సంయుక్తంగా లైవ్‌లీహుడ్ అవార్డు ఇవ్వనున్నారు.
  • నోబెల్ బహుమతి మానవ సమస్యలపై పోరాడుతున్న వారికి దక్కడం లేదంటూ 1980లో జర్మన్-స్వీడిష్ రచయిత జాకబ్ వాన్ యుయెక్స్‌కుల్ ‘రైట్ లైవ్‌లీహుడ్ అవార్డు’ను స్థాపించారు. నోబెల్ బహుమతికి ప్రత్యామ్నాయంగా దీనిని పిలుస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైట్ టు లైవ్‌లీహుడ్ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : గ్రెటా థన్‌బర్గ్, అమీనాటౌ హౌదర్, గువో జియాన్మీ, డేవి కోపెనావా

పాయల్ జంగిడ్‌కి ఛేంజ్‌మేకర్ అవార్డు
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేసిన పాయల్ జంగిడ్‌కి బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఇచ్చే ‘ఛేంజ్‌మేకర్-2019’ అవార్డు లభించింది. అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 24న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును పాయల్‌కు ప్రదానం చేశారు. రాజస్థాన్‌లోని హిన్‌స్లా గ్రామానికి చెందిన 17 ఏళ్ల పాయల్ బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు, ఆడపిల్లలు చదువుకునేందుకు కృషి చేస్తోంది. 2017లో రీబక్ సంస్థ నుంచి ‘యంగ్ అచీవర్’అవార్డును ఆమె అందుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాయల్ జంగిడ్‌కి ఛేంజ్‌మేకర్-2019 అవార్డు ప్రదానం
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఎందుకు : బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేసినందుకు

ఏపీకి నాలుగు పర్యాటక అవార్డులు
అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్ 27) సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ జాతీయ అవార్డులను ప్రకటించింది. పర్యాటక విభాగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రకటించిన ఈ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు లభించాయి. పర్యాటక రంగం సమగ్రాభివృద్ధి విభాగంలో ఏపీకి జాతీయ ఉత్తమ రాష్ట్రం అవార్డు లభించింది. అలాగే పర్యాటక ప్రదేశాల సమగ్ర సమాచారంతో పర్యాటకుల హృదయాలను హత్తుకునే విధంగా ముద్రణ విభాగంలో రాష్ట్రానికి అవార్డు దక్కింది.
అదేవిధంగా ప్రయాణికుల భద్రత, సేవారంగంలో ఉత్తమ సేవలందిస్తున్న విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు స్నేహపూర్వక రైల్వే స్టేషన్‌గా అవార్డు దక్కింది. నాలుగు నక్షత్రాల హోటల్ విభాగంలో విజయవాడలోని క్వాలిటీ హోటల్ డి.వి.మానర్ అవార్డు పొందింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సెప్టెంబర్ 27న నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పాటిల్ నుంచి ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఉత్తమ రాష్ట్రం అవార్డును స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీకి నాలుగు పర్యాటక అవార్డులు
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : కేంద్ర పర్యాటక శాఖ
ఎందుకు : పర్యాటక విభాగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా

తెలంగాణకు రెండు జాతీయ అవార్డులు
అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్ 27) సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ అందజేసిన జాతీయ పర్యాటక అవార్డుల్లో రెండింటిని తెలంగాణ అందుకుంది. టూరిస్టులకు పర్యాటక ప్రదేశాలకు సంబంధించి విసృ్తత సమాచారం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్ ‘ఐ ఎక్స్‌ప్లోర్ తెలంగాణ’కు వెబ్‌సైట్ కేటగిరీలో అవార్డు లభించింది. ఇక ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం కేటగిరీలో అపోలో ఆస్పత్రికి అవార్డు దక్కింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సెప్టెంబర్ 27న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అపోలో ఆస్పత్రి ప్రతినిధులు ఈ అవార్డులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణకు రెండు జాతీయ అవార్డులు
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : పర్యాటక విభాగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా

కవి శివారెడ్డికి సరస్వతి సమ్మాన్ పురస్కారం
ప్రముఖ తెలుగు కవి డా. కె. శివారెడ్డికి కేకే బిర్లా ఫౌండేషన్ ప్రదానం చేసే సరస్వతి సమ్మాన్-2018 పురస్కారం లభించింది. ఆయన రచించిన ‘పక్కకి ఒత్తిగిలితే’ కవితా సంపుటి ఈ అవార్డుకు ఎంపికైంది. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 28న జరిగిన బిర్లా ఫౌండేషన్ 28వ సరస్వతి సమ్మాన్ వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో శివారెడ్డికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. జ్ఞాపికతోపాటు అవార్డు కింద ఫౌండేషన్ ఇచ్చే రూ. 15 లక్షల నగదును అందజేశారు. ప్రస్తుతం కేకే బిర్లా ఫౌండేషన్ అధ్యక్షురాలుగా శోభనా భారతీయ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కవి శివారెడ్డికి సరస్వతి సమ్మాన్ పురస్కారం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : కేకే బిర్లా ఫౌండేషన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ‘పక్కకి ఒత్తిగిలితే’ కవితా సంపుటి రచించినందుకు

పెద్దపల్లి జిల్లాకి స్వచ్ఛభారత్ అవార్డు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకి ‘స్వచ్ఛభారత్ దివాస్ అవార్డు’ లభించింది. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు ప్రధాని నరేంద్ర మోదీ అవార్డును ప్రదానం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే-2019లో ఉత్తమ జిల్లాల కేటగిరీలో పెద్దపల్లి జిల్లా జాతీయస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచినందకుగాను ఈ అవార్డు దక్కింది. స్వచ్ఛసర్వేక్షణ్-2019లో భాగంగా దేశంలోని 690 జిల్లాలు, 17,400 గ్రామాల్లో జల్‌శక్తి శాఖ సర్వే నిర్వహించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛభారత్ దివాస్ అవార్డు విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : పెద్దపల్లి జిల్లా
ఎందుకు : స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే-2019లో జాతీయస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచినందకుగాను

సీసీఎంబీ శాస్త్రవేత్తకు రామచంద్రన్ అవార్డు
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)కి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ అమితాబ ఛటోపాధ్యాయకు సీఎస్‌ఐఆర్ - జి.ఎన్.రామచంద్రన్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 26న నిర్వహించిన కార్యక్రమంలో ఛటోపాధ్యాయకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డును ప్రదానం చేశారు. జీవ, సాంకేతిక శాస్త్రాల్లో పరిశోధనలకుగాను ఛటోపాధ్యాయకు శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్) అవార్డు దక్కింది.
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో శాస్త్రవేత్తగా ఉన్న డాక్టర్ జాన్ మొండల్ సీఎస్‌ఐఆర్ యువ శాస్త్రవేత్త-2019కు ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి హర్షవర్దన్ చేతుల మీదుగా జాన్ మొండల్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

గిన్నీస్ రికార్డుల్లో గాంధీ చిత్రపటం
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో లిఖించిన మహాత్ముని భారీ చిత్రపటం గిన్నీస్ రికార్డుకెక్కింది. తిరుపతిలోని గాంధీ భవన్‌లో అక్టోబర్ 2న ఆవిష్కరించిన ఈ చిత్రాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు పర్యవేక్షించి రికార్డులో నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చిత్రకారుడు అమన్‌సింగ్ గులాటీ (18) ఆరు రోజుల వ్యవధిలో పెన్సిల్‌తో 4,550 చదరపు అడుగుల గాంధీ చిత్రాన్ని లిఖించారు.

పెద్దపల్లికి స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు జాతీయ స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డు లభించింది. అక్టోబర్ 2న గుజరాత్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్ వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛ్ భారత్ దివస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అల్లమరాజు శ్రీదేవసేన ఈ అవార్డును స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్-2019 సర్వేలో పెద్దపల్లి జిల్లా జాతీయ స్థాయిలో అగ్రస్థానం నిలిచి ఈ అవార్డును కైవసం చేసుకుంది. దేశంలోని 690 జిల్లాలో 17,400 గ్రామాల్లో స్వచ్ఛ్ సర్వేక్షణ్ సర్వేను నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డు విజేత
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : పెద్దపల్లి జిల్లా
ఎందుకు : స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్-2019 సర్వేలో జాతీయ స్థాయిలో అగ్రస్థానం నిలిచినందుకు

ఇర్కోడ్ గ్రామానికి స్వచ్ఛత స్వశక్తి అవార్డు
Current Affairs
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా ఇర్కోడ్ గ్రామానికి స్వచ్ఛత స్వశక్తి కిరణ్-2019 అవార్డు లభించింది. సాంఘిక-సామాజిక అభివృద్ధి అంశంపై ఇర్కోడ్ గ్రామం ఈ అవార్డుకి ఎంపికైనట్లు కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ సంజిత్‌పాత్ జోషి సెప్టెంబర్ 19న వెల్లడించారు. 2019, అక్టోబర్‌లో ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో కేంద్రమంత్రుల చేతుల మీదుగా రూ.8 లక్షల రివార్డుతో పాటుగా అవార్డును గ్రామ ప్రతినిధులు అందుకోనున్నారు.

జాతీయ ఐక్యతా అవార్డు ఏర్పాటు
పద్మ అవార్డుల మాదిరిగా సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అవార్డుకు సంబంధించిన విధి విధానాలను కేంద్ర హోంశాఖ సెప్టెంబర్ 20న వెల్లడించింది. భారత తొలి హోంమంత్రిగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశ ఐక్యతకు చేసిన అనుపమాన సేవలకు గుర్తుగా ఆయన పేరిట అవార్డు ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ 2018, డిసెంబర్ 23న ప్రకటించిన విషయం తెలిసిందే.
అవార్డు విధి విధానాలు
  • దేశ ఐక్యత, సమగ్రత కోసం చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
  • రాష్ట్రపతి చేతులమీదుగా ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
  • శుద్ధమైన బంగారం, వెండి మిశ్రమంతో పతకాన్ని రూపొందిస్తారు.
  • అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ అవార్డును మరణానంతరం ప్రకటిస్తారు.
  • హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రత్యేక కమిటీ అవార్డుకు అర్హులైన వారి పేర్లను ఎంపిక చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా అవార్డు ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : కేంద్రప్రభుత్వం

మిషన్ భగీరథకు జల మిషన్ అవార్డు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి జాతీయ జల మిషన్ అవార్డు లభించింది. నీటి వినియోగ సామర్థ్యాన్ని 20 శాతం పెంచినందుకుగాను ఈ అవార్డు దక్కింది. అలాగే సమగ్ర నీటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచినందుకు తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌కు (టీఎస్‌డబ్ల్యూఐఆర్‌ఎస్), భూగర్భజలాలు ప్రమాదకర స్థితికి చేరిన ప్రాంతాల పునరుజ్జీవానికి ప్రత్యేక దృష్టి పెట్టినందుకు రాష్ర్ట భూగర్భజల విభాగానికి అవార్డులు దక్కాయి. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 25న జరగనున్న కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిషన్ భగీరథ పథకానికి జాతీయ జల మిషన్ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ
ఎందుకు : నీటి వినియోగ సామర్థ్యాన్ని 20 శాతం పెంచినందుకుగాను

ఐఐసీటీ శాస్త్రవేత్తకు విశ్వేశ్వరయ్య అవార్డు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సీనియర్ శాస్త్రవేత్త ఎ.గంగాజ్ఞిరావుకు ప్రతిష్టాత్మక మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు లభించింది. 2019వ సంవత్సరానికిగాను తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీన ఇంజనీర్స్ డే సందర్భంగా ఈ అవార్డు అందించినట్లు ఐఐసీటీ సెప్టెంబర్ 23న తెలిపింది. వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ వ్యర్థాల నుంచి అధిక మొత్తంలో, వేగంగా ఇంధన వాయువు ఉత్పత్తి చేసేందుకు గంగాజ్ఞి విశేష కృషి చేశారు. పారిశ్రామిక వ్యర్థాల నుంచి వెలువడే వాయువుల శుద్ధికి కూడా ప్రత్యేక బయో ఫిల్టర్ తయారు చేసిన ఈయన.. గుర్రపు డెక్కను ఎరువుగా మార్చే ప్రక్రియను అభివృద్ధి చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శాస్త్రవేత్త ఎ.గంగాజ్ఞిరావుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం

అమితాబ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగంలో ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారానికి అమితాబ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవడేకర్ సెప్టెంబర్ 24న ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రమాగ్‌రాజ్(అలహాబాద్)లో 1942, అక్టోబర్ 11న జన్మించిన అమితాబ్ ‘సాత్ హిందూస్తానీ’తో సినీ ప్రస్థానం ప్రారంభించారు. 1973లో జంజీర్ సినిమాతో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా ఆయన పేరు దేశమంతటా మారుమోగిపోయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : అమితాబ్ బచ్చన్

ప్రధాని మోదీకి గ్లోబల్ గోల్ కీపర్ పురస్కారం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతీ ఏడాది ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ గోల్ కీపర్ పురస్కారం లభించింది. అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 24న జరిగిన కార్యక్రమంలో గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు. భారత్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి మోదీ సర్కార్ చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ ఐక్యరాజ్య సమితి విధించిన లక్ష్యాలను చేరుకోవడంతో ఈ అవార్డు ఇస్తున్నట్టు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని మోదీకి గ్లోబల్ గోల్ కీపర్ పురస్కారం
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా

పవర్‌గ్రిడ్‌కు స్వచ్ఛభారత్ అవార్డు
Current Affairs ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేట్ విభాగంలో పవర్‌గ్రిడ్‌కు స్వచ్ఛభారత్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సెప్టెంబర్ 13న జలశక్తి మంత్రిత్వశాఖ, తాగునీరు, పారిశుధ్య విభాగం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డును పవర్‌గ్రిడ్ సీఎండీ కే శ్రీకాంత్‌కు ప్రదానం చేశారు. స్వచ్ఛతకు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా అధిక నిధులను కేటాయించినందుకుగాను పవర్‌గ్రిడ్‌కు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పవర్‌గ్రిడ్‌కు స్వచ్ఛభారత్ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎందుకు : స్వచ్ఛతకు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా అధిక నిధులను కేటాయించినందుకు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రాజభాష పురస్కారం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్రతిష్టాత్మక రాజభాష కీర్తి పురస్కారం లభించింది. 2018-19కిగాను హిందీ అమలులో చూపిన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం రాజభాష కీర్తి పురస్కారం (ప్రథమ బహమతి) ప్రకటించింది. జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 14న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సహాయమంత్రులు నిత్యానందరాయ్, జి.కిషన్‌రెడ్డిల చేతుల మీదుగా స్టీల్‌ప్లాంట్ సీఎండీ పీకే రథ్ ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజభాష కీర్తి పురస్కారం- 2018-19
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : విశాఖ స్టీల్‌ప్లాంట్
ఎందుకు : హిందీ అమలులో చూపిన ప్రతిభకు

ఫొటోగ్రాఫర్ రఘురాయ్‌కు అకాడమీ అవార్డు
ప్రముఖ భారతీయ ఫొటోగ్రాఫర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత రఘురాయ్ ‘అకాడమీ దేస్ బియా-ఆర్‌‌ట్స ఫొటోగ్రఫీ’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 14న అవార్డు కమిటీ వెల్లడించింది. ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ విలియమ్ క్లీన్ పేరిట ఈ ఏడాదే అకాడమీ అవార్డును ఏర్పాటు చేశారు. దీంతో ఈ అవార్డుకు ఎంపికైన తొలి వ్యక్తిగా రఘురాయ్ నిలిచాడు. ఈ అవార్డు కింద 1,20,000 యూరోల (రూ.9.4 లక్షలు) నగదు బహుమతి అందిస్తారు. 1965లో ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ను ఆరంభించిన రఘురాయ్ పలు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అకాడమీ దేస్ బియా-ఆర్‌‌ట్స ఫొటోగ్రఫీ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : రఘురాయ్

గ్రెటా థన్‌బర్గ్‌కు ఆమ్నెస్టీ పురస్కారం
ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఉద్యమాన్ని ప్రారంభించి చిన్న వయస్సులోనే పర్యావరణ పరిరక్షణకు పోరాడుతున్న గ్రెటా థన్‌బర్గ్(16)కు అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (ఆమ్నెస్టీ) అందించే ‘అంబాసిడర్స్ ఆఫ్ కాన్‌సైన్స్’ పురస్కారం లభించింది. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో సెప్టెంబర్ 16న జరిగిన కార్యక్రమంలో ఆమ్నెస్టీ అధికార ప్రతినిధుల నుంచి ఆమె ఈ అవార్డును అందుకుంది.
విచ్చలవిడిగా చెట్ల నరికివేత, పరిశ్రమల ఏర్పాటు కారణంగా పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని, వెంటనే దీనిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ 2018, ఆగస్టులో థన్‌బర్గ్ ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వాలు పర్యావరణ రక్షణకు తగిన చర్యలు తీసుకొనేవరకు ప్రతి శుక్రవారం పాఠశాలకు హాజరుకావొద్దని ఆమె పిలుపు నిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆమ్నెస్టీ అంబాసిడర్స్ ఆఫ్ కాన్‌సైన్స్ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : గ్రెటా థన్‌బర్గ్
ఎక్కడ : వాషింగ్టన్ యూనివర్సిటీ, అమెరికా

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం
Current Affairs ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 5న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలను ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణా జిల్లా నిడమనూరు జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు బట్టు సురేష్ కుమార్, తెలంగాణ నుంచి జీడిమెట్ల జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల అధ్యాపకురాలు బెండి ఆశారాణి అవార్డులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ

జీఎమ్మార్‌కు స్వచ్ఛ మహోత్సవ్ అవార్డు
మెస్సర్స్ జీఎమ్మార్‌కు చెందిన కొర్లాపహాడ్ టోల్‌ప్లాజాకు స్వచ్ఛ మహోత్సవ్-2019 పురస్కారం లభించింది. ఢిల్లీలో సెప్టెంబర్ 6న జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేతుల మీదుగా సంస్థ ప్రతినిధులు కృష్ణప్రసాద్, ఎంకేఆర్.కిరణ్ అవార్డు అందుకున్నారు. పరిశుభ్రత విభాగంలో కొర్లాపహాడ్ టోల్‌ప్లాజా దేశవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. జాతీయ రహదారుల పరిశుభ్రత విభాగంలో స్వచ్ఛ మహోత్సవ్ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛ మహోత్సవ్-2019 పురస్కారం
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : కొర్లాపహాడ్ టోల్‌ప్లాజా, మెస్సర్స్ జీఎమ్మార్

మేఘా ఇంజనీరింగ్‌కు కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కు ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ (ఐసీఐ) నుంచి ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు లభించింది. కాంక్రీట్ డే సందర్భంగా ఐసీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో కాంక్రీట్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీఐ అధ్యక్షుడు వినయ్ గుప్తా చేతుల మీదుగా ఎంఈఐఎల్ డెరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మేఘా ఇంజనీరింగ్‌కు కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ (ఐసీఐ)
ఎక్కడ : హైదరాబాద్

కవయిత్రి శారదకు మాలతీ చందూర్ పురస్కారం
ప్రముఖ రచయిత్రి, కవయిత్రి శారద అశోక్‌వర్ధన్‌కు మాలతీ చందూర్ పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సెప్టెంబరు 7న జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రఖ్యాత తెలుగు కాలమిస్ట్.. దివంగత రచయిత్రి మాలతీ చందూర్ పేరిట ఏర్పాటు చేసిన ఈ పురస్కారం కింద రూ.50 వేల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాలతీ చందూర్ పురస్కారం
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : కవయిత్రి శారద అశోక్‌వర్ధన్
ఎక్కడ : హైదరాబాద్

ఎంపీ మార్గాని భరత్‌కు భారత్ గౌరవ్ అవార్డు
Current Affairs రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)కు భారత్ గౌరవ్ పురస్కారం లభించింది. న్యూఢిల్లీలో ఆగస్టు 29న జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేతుల మీదుగా భరత్ అవార్డు అందుకున్నారు. మొదటిసారి ఎంపీగా ఎన్నికైన భరత్
లోక్‌సభలో వివిధ అంశాలపై తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ, నియోజకవర్గ సమస్యలు, రాష్ట్ర సమస్యలపై గళం విప్పుతున్న తీరుకు గుర్తింపుగా భారత్ గౌరవ్ ఫౌండేషన్ ఈ పురస్కారంతో సత్కరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎంపీ మార్గాని భరత్‌కు భారత్ గౌరవ్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : లోక్‌సభలో సమస్యలపై గళం విప్పుతున్న తీరుకు గుర్తింపుగా

టీఎస్‌ఆర్టీసీకి క్యూసీఎఫ్‌ఐ పురస్కారం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)కు క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్‌ఐ) పురస్కారం లభించింది. హైదరాబాద్‌లో ఆగస్టు 29న నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు యాదగిరి, టీవీరావులు పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను టీఎస్‌ఆర్టీసీకి ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీఎస్‌ఆర్టీసీకి క్యూసీఎఫ్‌ఐ పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : ఉత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను

ఏపీకి సఫారీ ఇండియా అవార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖకు సఫారీ ఇండియా- దక్షిణాసియా ట్రావెల్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఆగస్టు 30న జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి చేతుల మీదుగా ఏపీ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకంలో మెరుగైన సేవలు, వసతులు కల్పించినందుకుగాను ఏపీకి ఈ అవార్డు దక్కింది. సుస్థిర పర్యాటకం-సవాళ్లు థీమ్‌తో సఫారీ ఇండియా ఏటా దక్షిణాసియా ట్రావెల్ అవార్డు అందజేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సఫారీ ఇండియా- దక్షిణాసియా ట్రావెల్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ
ఎందుకు : ఆధ్యాత్మిక పర్యాటకంలో మెరుగైన సేవలు, వసతులు కల్పించినందుకుగాను

ఇక్రిశాట్ డెరైక్టర్‌కు జయశంకర్ పురస్కారం
ఇక్రిశాట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డెరైక్టర్ రాజీవ్ కె.వర్షిణికి ప్రొఫెసర్ జయశంకర్ లైఫ్‌టైమ్ పురస్కారం లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 5వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా వర్షిణి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ పరిస్థితులకు అనువైన కొత్త వంగడాల రూపకల్పనపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టాలన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రొఫెసర్ జయశంకర్ లైఫ్‌టైమ్ పురస్కారం
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : ఇక్రిశాట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డెరైక్టర్ రాజీవ్ కె.వర్షిణి

డాక్టర్ హేమలతకు ఛేంజ్ మేకర్ అవార్డు
జాతీయ పోషకాహార సంస్థ డెరైక్టర్ డాక్టర్ హేమలత ఛేంజ్ మేకర్ అవార్డును దక్కించుకున్నారు. సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన ఈ అవార్డును తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా హేమలత అందుకున్నారు. సేవ్ ది చిల్డ్రన్ ఏర్పాటై వందేళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. శిశు పోషణ విషయంలో విశేషకృషి చేసినందుకు గుర్తింపుగా హేమలతకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సేవ్ ది చిల్డ్రన్ సంస్థ అందించే ఛేంజ్ మేకర్ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : జాతీయ పోషకాహార సంస్థ డెరైక్టర్ డాక్టర్ హేమలత
ఎందుకు : శిశు పోషణ విషయంలో విశేషకృషి చేసినందుకు గుర్తింపుగా

ప్రధాని మోదీకి గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ గోల్‌కీపర్’ అవార్డు లభించింది. పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి గుర్తింపుగా ట్రస్ట్ బెల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేయనుంది. 2019, సెప్టెంబర్ 24న బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ వేదికగా జరగనున్న ఓ కార్యక్రమంలో మోదీ ఈ అవార్డు అందుకోనున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు ప్రధాని త్వరలో అమెరికా వెళ్లనున్న సంగతి తెలిసిందే .
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆయన సతీమణి మెలిండాల పేరుతో ట్రస్ట్ బెల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటైంది. ప్రపంచ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పరిష్కరించే ప్రయత్నాలు చేపట్టిన రాజకీయ నేతలకు గుర్తింపుగా గ్లోబల్ గోల్‌కీపర్ ఇస్తున్నట్లు ఫౌండేషన్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని నరేంద్ర మోదీకి గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : ట్రస్ట్ బెల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్
ఎందుకు : స్వచ్ఛభారత్ కార్యక్రమానికి గుర్తింపుగా
Published date : 25 Sep 2019 04:08PM

Photo Stories