Skip to main content

French Open 2023: మూడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గిన సెర్బియా స్టార్‌.. మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్

పురుషుల టెన్నిస్‌లో అద్భుతం ఆవిష్కృతమైంది. సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుడిగా అవతరించాడు.
Djokovic

22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌తో సమఉజ్జీగా ఉన్న జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచి 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. 14 సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన రాఫెల్‌ నాదల్‌ గాయంతో బరిలోకి దిగకపోవడంతో జొకోవిచ్‌ను టైటిల్‌ ఫేవరెట్‌గా పరిగణించారు. తనపై అభిమానులు పెట్టుకున్న 
అంచనాలను అతను నిజం చేశాడు. 
ఆద్యంతం నిలకడగా ఆడుతూ జొకోవిచ్‌ మూడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు. స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ గత ఏడాది ఆటకు గుడ్‌బై చెప్పడం.. స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ గాయం కారణంగా ఈ ఏడాది మరే టోర్నీలోనూ ఆడే అవకాశం లేకపోవడం.. వెరసి ఈ ఏడాది మిగిలిన రెండు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ (వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌) జొకోవిచ్‌ టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ రెండు టోర్నీల్లోనూ జొకోవిచ్‌ విజేతగా నిలిస్తే టెన్నిస్‌ చరిత్రలో చిరకాలం రారాజుగా నిలిచిపోతాడు.

IPL 2023: ఐపీఎల్ 2023 రికార్డులివే.. 250 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ధోని రికార్డు..
   
ఎలాంటి సంచలన ఫలితం నమోదు కాలేదు. ఊహించిన విధంగానే సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ స్థాయికి తగ్గ ప్రదర్శనతో అదరగొట్టాడు. టెన్నిస్‌ సీజన్‌లోని రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో జొకోవిచ్‌ మూడోసారి విజేతగా నిలిచాడు. జూన్ 11న‌ జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో మూడో సీడ్‌ జొకోవిచ్‌ 3 గంటల 13 నిమిషాల్లో 7–6 (7/1), 6–3, 7–5తో నాలుగో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే)పై గెలుపొందాడు. విన్నర్‌ జొకోవిచ్‌కు 23 లక్షల యూరోలు (రూ.20 కోట్ల 41 లక్షలు), రన్నరప్‌ కాస్పర్‌ రూడ్‌కు 11 లక్షల 50 వేల యూరోలు (రూ. 10 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ విజయంతో జొకోవిచ్‌ 23వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా నేడు విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. మరోవైపు కాస్పర్‌ రూడ్‌కు మూడోసారీ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్లో నిరాశ ఎదురైంది. గత ఏడాది రూడ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌లలో ఫైనల్‌ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.  

Malaysia Masters: చరిత్ర సృష్టించిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌.. ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌..

గట్టి పోటీ లభించినా..
కెరీర్‌లో 34వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడుతున్న జొకోవిచ్‌ ఒకవైపు.. కేవలం మూడో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడుతున్న కాస్పర్‌ రూడ్‌ మరోవైపు.. ఈ ఇద్దరిలో ఎవరికి విజయావకాశాలు ఉంటాయని అడిగితే జొకోవిచ్‌వైపే మొగ్గు చూపుతారు. ఆదివారం అలాగే జరిగింది. ఆరంభంలో జొకోవిచ్‌కు రూడ్‌ గట్టిపోటీ ఇచ్చినా మ్యాచ్‌ కొనసాగుతున్నకొద్దీ జొకోవిచ్‌ జోరు పెంచాడు. తొలి సెట్‌ తొలి గేమ్‌లో సర్వీస్‌ నిలబెట్టుకున్న రూడ్‌... 11 నిమిషాలపాటు సుదీర్ఘంగా సాగిన రెండో గేమ్‌లో జొకోవిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని 3–0తో ఆధిక్యంలోకి వచ్చాడు. దాంతో జొకోవిచ్‌కు విజయం అంత సులువుగా దక్కదనిపించింది. అయితే జొకోవిచ్‌ నెమ్మదిగా పుంజుకున్నాడు. రూడ్‌ ఆటతీరును అంచనా వేసి తన వ్యూహాలను మార్చుకున్నాడు.
ఏడో గేమ్‌లో రూడ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి, ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకున్న జొకోవిచ్‌ స్కోరును 4–4తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్‌ పైచేయి సాధించి తొలి సెట్‌ను 90 నిమిషాల్లో దక్కించుకున్నాడు. రెండో సెట్‌లోని రెండో గేమ్‌లోనే రూడ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ అదే జోరులో 3–0తో ముందంజ వేశాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యం కాపాడుకొని రెండో సెట్‌ను 48 నిమిషాల్లో సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు 11వ గేమ్‌లో రూడ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ 6–5తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని మూడో సెట్‌ను 55 నిమిషాల్లో నెగ్గి విజేతగా అవతరించాడు. 

Athletics Rankings: నీర‌జ్ చోప్రా మ‌రో ఘ‌న‌త‌.. వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 ర్యాంక్ సొంతం​​​​​​​

‘క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌’పై మరోసారి గురి.. 
ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ కూడా సాధించిన జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ నెగ్గడంతో అతనికి మరోసారి ‘క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌’ (ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గడం) ఘనతను సాధించే అవకాశం వచ్చింది. గాయం కారణంగా నాదల్‌ ఈ ఏడాది మరే టోర్నీలో ఆడే అవకాశం లేకపోవడంతో జొకోవిచ్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ‘క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌’ ఘనతను అందుకునే అవకాశముంది. పురుషుల టెన్నిస్‌లో రాడ్‌ లేవర్‌ (1969లో), మహిళల టెన్నిస్‌లో స్టెఫీ గ్రాఫ్‌ (1988లో) మాత్రమే ‘క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌’ ఘనతను సాధించారు. 2021లో జొకోవిచ్‌ వరుసగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌ టైటిల్స్‌ గెలిచినా...యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో మెద్వెదెవ్‌ (రష్యా) చేతిలో ఓడిపోవడంతో జొకోవిచ్‌కు సువర్ణావకాశం చేజారింది.   

ISSF World Cup Baku 2023: రిథమ్‌ ప్రపంచ రికార్డు.. అయినా పతకానికి దూరం​​​​​​​

ఫైనల్‌ మ్యాచ్‌ గణాంకాలు  
జొకోవిచ్‌        కాస్పర్‌ రూడ్‌ 
11    ఏస్‌లు    4 
1    డబుల్‌ ఫాల్ట్‌లు    1 
3/10    బ్రేక్‌ పాయింట్లు    1/4 
52    విన్నర్స్‌    31 
32    అనవసర తప్పిదాలు    31 
20/27    నెట్‌ పాయింట్లు    14/20 
12    డ్రాప్‌ షాట్‌లు    18 
118    మొత్తం పాయింట్లు    89 

Novak Djokovic

జొకోవిచ్‌ 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ 
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 
2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023 
ఫ్రెంచ్‌ ఓపెన్‌  
2016, 2021, 2023 
వింబుల్డన్‌  
2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022 
యూఎస్‌ ఓపెన్‌  
2011, 2015, 2018 

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ వీరులు (కనీసం 10) 
జొకోవిచ్‌     (సెర్బియా)     23 
రాఫెల్‌ నాదల్‌     (స్పెయిన్‌)     22 
ఫెడరర్‌     (స్విట్జర్లాండ్‌)     20 
పీట్‌ సంప్రాస్‌     (అమెరికా)     14 
రాయ్‌ ఎమర్సన్‌     (ఆస్ట్రేలియా)     12 
జాన్‌ బోర్గ్‌     (స్వీడన్‌)     11 
రాడ్‌ లేవర్‌     (ఆస్ట్రేలియా)     11 
బిల్‌ టిల్డెన్‌     (అమెరికా)     10 

☛ టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలను కనీసం మూడుసార్లు చొప్పున గెలిచిన తొలి ప్లేయర్‌గా జొకోవిచ్‌ నిలిచాడు. 

ISSF World Cup : ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో సరబ్‌జోత్‌–దివ్య జోడీకి స్వర్ణం

Published date : 12 Jun 2023 11:32AM

Photo Stories