Skip to main content

Australian Open 2022: టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుడు?

Rafael Nadal 21st Grandslam

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌–2022 పురుషుల సింగిల్స్‌ విభాగంలో స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ విజేతగా అవతరించాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ వేదికగా జనవరి 30న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ 2–6, 6–7 (5/7), 6–4, 6–4, 7–5తో రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై గెలిచి, టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. టెన్నిస్‌లో ఓపెన్‌ శకం (1968 నుంచి) మొదలయ్యాక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో తొలి రెండు సెట్‌లు కోల్పోయాక కూడా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌ నాదల్‌. విజేతగా నిలిచిన నాదల్‌కు 28 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 15 కోట్ల 9 లక్షలు)... రన్నరప్‌ మెద్వెదెవ్‌కు 15 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 8 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుడు..

తాజా విజయంతో రాఫెల్‌ నాదల్‌.. తన కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకున్నట్లయింది. అలాగే రెండోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలవడంతోపాటు పురుషుల టెన్నిస్‌ చరిత్రలో అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా కొత్త చరిత్రను లిఖించాడు. ఈ టోర్నీకి ముందు ‘దిగ్గజ త్రయం’ రాఫెల్‌ నాదల్, రోజర్‌ ఫెడరర్, నోవాక్‌ జొకోవిచ్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో సమఉజ్జీగా ఉన్నారు. తాజా విజయంతో ఫెడరర్, జొకోవిచ్‌లను వెనక్కి నెట్టి 35 ఏళ్ల నాదల్‌ ముందుకొచ్చాడు. సమీప భవిష్యత్‌లో నాదల్‌ను అధిగమించే అవకాశం కేవలం 34 ఏళ్ల జొకోవిచ్‌కు మాత్రమే ఉంది. గాయాలతో సతమతమవుతున్న 40 ఏళ్ల ఫెడరర్‌ కెరీర్‌ ముగింపు దశకు చేరుకుంది.

నాదల్‌ 21 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ 

  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌: 2009, 2022
  • ఫ్రెంచ్‌ ఓపెన్‌: 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020
  • వింబుల్డన్‌: 2008, 2010
  • యూఎస్‌ ఓపెన్‌: 2010, 2013, 2017, 2019

గ్రాండ్‌స్లామ్‌ ఆధిక్యం మారిన వేళ..

  • 2022 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌: 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో జొకోవిచ్, ఫెడరర్‌లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన నాదల్‌ 21వ ‘గ్రాండ్‌’ టైటిల్‌తో ఒంటరిగా ఆధిక్యంలోకి వచ్చాడు. 
  • 2009 వింబుల్డన్‌: 14 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో పీట్‌ సంప్రాస్‌ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ ఫెడరర్‌ 15వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో ఆధిక్యంలోకి వచ్చాడు. 
  • 2000 వింబుల్డన్‌: 12 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో రాయ్‌ ఎమర్సన్‌ పేరిట ఉన్న రికార్డును సవరిస్తూ సంప్రాస్‌ 13వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో ఆధిక్యంలోకి వచ్చాడు.

పురుషుల్లో.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన క్రీడాకారులు(కనీసం 10)

క్రీడాకారుడి పేరు

గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సంఖ్య

 రాఫెల్‌ నాదల్‌(స్పెయిన్‌)

21

జొకోవిచ్‌(సెర్బియా)

20

ఫెడరర్‌(స్విట్జర్లాండ్‌)

20

పీట్‌ సంప్రాస్‌(అమెరికా)

14

రాయ్‌ ఎమర్సన్‌(ఆస్ట్రేలియా)

12

జాన్‌ బోర్గ్‌(స్వీడన్‌)

11

రాడ్‌ లేవర్‌(ఆస్ట్రేలియా)

11

బిల్‌ టిల్డెన్‌(అమెరికా)

10

చ‌ద‌వండి: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ విజేత?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌–2022 పురుషుల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ గెలిచిని క్రీడాకారుడు?
ఎప్పుడు : జనవరి 30
ఎవరు    : స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌
ఎక్కడ    : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
ఎందుకు : పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ 2–6, 6–7 (5/7), 6–4, 6–4, 7–5తో రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై గెలిచినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 31 Jan 2022 05:20PM

Photo Stories