Skip to main content

Jupiter Moon Io: బృహస్పతి చంద్రుడిపై శిలాద్రవ గదులు.. నిత్యం జ్వలిస్తున్న అగ్నిపర్వతాలు!

సౌర వ్యవస్థలో సూర్యుడి నుంచి ఐదో గ్రహం జూపిటర్‌(బృహస్పతి).
NASA Juno captures stunning close-up of Jupiter’s moon Io’s volcanic activity

అన్ని గ్రహాల్లోకెల్లా ఇదే పెద్దది. మన భూమికి ఉపగ్రహం చందమామ ఉన్నట్లే బృహస్పతికి కూడా ‘ఐవా’ అనే ఉపగ్రహం ఉంది. మొత్తం సౌర వ్యవస్థలో నిరంతరం జ్వలించే భారీ అగ్నిపర్వతాలు (వాల్కనో) ఉన్న పెద్ద ఉపగ్రహం ఐవా. ఇక్కడ 400 అగ్నిపర్వతాలు ఉన్నట్లు అంచనా. ఇవి నిత్యం శిలాద్రవాన్ని(మాగ్మా) విరజిమ్ముతూనే ఉంటాయి. అదొక అగ్ని గుండమని చెప్పొచ్చు. 

సరిగ్గా మన చందమామ పరిమాణంలో ఉండే ఐవాలో ఈ వాల్కనోలకు కారణం ఏమిటన్నది చాలా ఏళ్లుగా మిస్టరీగానే ఉండేది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ’నాసా’ ఈ రహస్యాన్ని ఛేదించే విషయంలో పురోగతి సాధించింది. నాసా సైంటిస్టులు జూనో మిషన్‌లో భాగంగా బృహస్పతిపై పరిశోధనలకు జూనో స్పేస్‌క్రాఫ్ట్‌ ప్రయోగించారు. 2023 డిసెంబర్, 2024 ఫిబ్రవరిలో ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ ఐవా సమీపంలోకి వెళ్లింది. ఐవా ఉపరితలం నుంచి 1,500 కిలోమీటర్ల ఎత్తువరకూ చేరుకొని ఫొటోలు చిత్రీకరించింది. అత్యంత కచ్చితత్వంతో కూడిన డాప్లర్‌ డేటాను సేకరించింది. 

New Predator: పసిఫిక్‌ మహాసముద్రంలో చీకటి జీవిని గుర్తించిన సైంటిస్టులు

ఈ గణాంకాలను విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలు ఐవాపై నిప్పుల కొండలకు కారణం ఏమిటన్నది గుర్తించారు. ఐవా ఉపరితలం కింద మాగ్మా ఒక సముద్రం తరహాలో విస్తరించి లేదని, వేర్వేరు చాంబర్ల(గదులు)లో ఉందని కనిపెట్టారు. శిలాద్రవం ఒకదానితో ఒకటి సంబంధం లేదని వేర్వేరు చాంబర్లలో ఉండడం వల్ల అధిక ఒత్తిడితో ఉపరితలంపైకి వేగంగా చొచ్చుకొని వస్తున్నట్లు చెప్పారు. దాంతో విరామం లేకుండా అగ్నిపర్వతాలు జ్వలిస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ సముద్రం తరహాలో మాగ్మా విస్తరించే ఉంటే దానిపై ఒత్తిడి తక్కువగా ఉండేది. అలాంటప్పుడు అది పైకి ఉబికి వచ్చే అవకాశం అంతగా ఉండదు.

ఈ అధ్యయనం వివరాలను నేచురల్‌ జర్నల్‌లో ప్రచురించారు. ఐవా ఉపగ్రహాన్ని తొలిసారిగా 1610లో గలీలియో గలిలీ కనిపెట్టారు. కానీ, అక్కడ భారీ సంఖ్యలో అగ్నిపర్వతాలు ఉన్న సంగతి 1979తో తెలిసింది. నాసా ప్రయోగించిన వోయేజర్‌–1 స్పేస్‌క్రాఫ్ట్‌ ఈ విషయం గుర్తించింది. అప్పటి నుంచి వీటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఐవాపైనున్న వాల్కనోల గుట్టు తెలిసింది కాబట్టి గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా, ఎప్పుడు ఏర్పడ్డాయన్నది గుర్తించడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. 

Air Pollution: వాయుకాలుష్యంతో.. రక్తం గడ్డకట్టే ముప్పు

Published date : 16 Dec 2024 03:09PM

Photo Stories