సూర్యుడు లేని గ్రహాలు..!
పాలపుంత గెలాక్సీలో ఎటువంటి నక్షత్రం చుట్టూ భ్రమణం చేయకుండా స్వేచ్ఛగా తిరిగే 100కుపైగా భారీ గ్రహాలను కనుగొన్నారు. ఇవన్నీ సైజులో గురుగ్రహం కన్నా పెద్దవి. ఇలాంటివి మరిన్ని లక్షలుండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఫ్రీ ఫ్లోటింగ్ ప్లానెట్స్(మాతృ నక్షత్రం లేని గ్రహాలు) 70– 172 వరకు కనుగొనడం మాత్రం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కనుగొన్న ఫ్రీఫ్లోటింగ్ ప్లానెట్స్ కన్నా తాజాగా కనుగొన్నవి రెట్టింపున్నాయి. నక్షత్ర ఉత్పత్తి సమయంలో ఇలాంటి గ్రహాలు ఏర్పడతాయని ఒక అంచనా. బరువులో జూపిటర్‌కు సుమారు 13 రెట్లున్న ఈ గ్రహాల ఉత్పత్తిపై భిన్న అంచనాలున్నాయి. నక్షత్రాల్లాగానే వాయు సమూహాల మధ్య గురుత్వాకర్షణ శక్తి నశించడం వల్ల ఏర్పడి ఉండొవచ్చని, మాతృనక్షత్రం నుంచి భ్రమణం చేసే సమయంలో అనూహ్యంగా కక్ష్య నుంచి బయటకు వచ్చి ఉండొచ్చని.. పలు ఊహాగానాలు చేస్తున్నా వీటి పుట్టుకకు మాత్రం సరైన కారణాలు ఇంకా తెలియలేదు. జర్నల్ నేచర్ ఆస్ట్రానమీలో వీటి వివరాలు ప్రచురించారు. వృశ్చిక రాశి నక్షత్ర సముదాయానికి దగ్గరలో వీటిని గుర్తించారు. పలు నక్షత్రాల మధ్య ఇవి స్వేచ్ఛగా పరిభ్రమించేందుకు కారణాలు అన్వేíÙంచాల్సిఉందని పరిశోధనలో పాల్గొన్న రియా మిరెట్ రొయిగ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోపుతో వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టవచ్చని భావిస్తున్నారు. నక్షత్రంతో పనిలేకుండా తిరిగే వీటిలో వాతావరణం వృద్ది చెందడాన్ని పరిశీలిస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు బయటపడే అవకాశం ఉందని సైంటిస్టుల భావన.