Astronomy: జేమ్స్ వెబ్ టెలిస్కోపు ప్రయోగాన్ని ఏ తేదీన నిర్వహించనున్నారు?
ఇంతవరకు విశ్వరహస్యాలను అందిస్తూ వస్తున్న హబుల్ టెలిస్కోపుకు వారసురాలిగా, అంతకన్నా శక్తివంతమైనదిగా తీర్చిదిద్దిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు ప్రయోగం 2021, డిసెంబర్ 22న జరగనుంది. బిగ్‌బ్యాంగ్ అనంతర పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భవ అంశాలను లోతుగా పరిశీలించేందుకు ఈ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడనుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీల సహకారంతో నాసా ఈ టెలిస్కోపును అభివృద్ది చేస్తోంది. దాదాపు 20కి పైగా దేశాలకు ఈ టెలిస్కోపు నిర్మాణంలో భాగస్వామ్యం ఉంది. ఏరియన్ 5 స్పేస్ రాకెట్‌లో ఫ్రెంచ్ గినియాలోని గినియాస్పేస్ సెంటర్ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు.
25 సంవత్సరాలు.. రూ. 76 వేల కోట్లు..
1996 ఏడాదిలో ఎన్‌జీఎస్‌టీ పేరిట ఈ టెలిస్కోపు ప్రాజెక్టు ఆరంభమైంది. 2002లో దీనికి జేమ్స్ వెబ్ పేరును పెట్టారు. సుదీర్ఘకాలం పట్టిన ఈ టెలిస్కోపు నిర్మాణం సాఫీగా జరగలేదు. నిధుల కొరతతో ప్రాజెక్టు చాలా ఆలస్యం అయింది. దీంతో సుమారు 25 సంవత్సరాల కృషి అనంతరం 2021కి టెలిస్కోపు సిద్ధమైంది. దీని నిర్మాణంలో దాదాపు 10వేల మంది సైంటిస్టులు 4 కోట్ల పనిగంటల పాటు కష్టపడ్డారు. 1996లో ఈ టెలిస్కోపు నిర్మాణ అంచనా నిధులు 50 కోట్ల డాలర్లు కాగా, 2021లో పూర్తయ్యేనాటికి 1,000 కోట్ల డాలర్ల (సుమారు 76 వేల కోట్ల రూపాయలు) వ్యయమైంది.
లక్షల కిలోమీటర్ల దూరంలో..
డిసెంబర్ 22న ప్రయోగంతో జేమ్స్ వెబ్‌ను భూమి– సూర్యుల మధ్య ఉన్న ఎల్2 లాంగ్రేజియన్ బిందువు వద్దకు చేరుస్తారు. ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఇది భూమిలా సూర్యుని చూట్టూ పరిభ్రమిస్తుంటుంది. ప్రయోగించిన 11 రోజులకు ఇది ఎల్2 పాయింటుకు చేరుకుంటుంది. ఇక హబుల్ టెలిస్కోపు భూమికి సుమారు 550 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోంది.
1350 కోట్ల సంవత్సరాల క్రితం కాంతి..
బిగ్ బ్యాంగ్ అనంతరం ఏర్పడ్డ తొలి నక్షత్రాలు, గాలక్సీల నుండి వెలువడ్డ కాంతి కోసం అన్వేషణ, గెలాక్సీల నిర్మాణం, పరిణామాలను, నక్షత్ర, గ్రహ వ్యవస్థల ఏర్పాటును అధ్యయనం చేయడం, జీవావిర్భావాన్ని పరిశోధించడం లక్ష్యంగా ఈ టెలిస్కోపు పనిచేయనుంది. విశ్వం ఆవిర్భవించి ఇప్పటికి సుమారు 1380 కోట్ల సంవత్సరాలైందని అంచనా. ఈ టెలిస్కోపు సుమారు 1350 కోట్ల సంవత్సరాల పూర్వపు కాంతిని పసిగట్టగలదు.
జేమ్స్‌వెబ్ టెలిస్కోపు విశేషాలు..
- సైజు: 72 x 39 అడుగులు
- బరువు: 6 టన్నులు
- వేగం: సూర్యుని చుట్టూ భూమి తిరిగే వేగానికి అంటే 67వేల ఎంపీహెచ్‌కు సమానం.
- జీవిత కాలం: 10 ఏళ్లు
- 458 జీబీ కక్ష్యలోకి చేరాక ఇది రోజుకు 458 గిగాబైట్ల డేటాను పదేళ్ల పాటు పంపగలదు.
- తయారు చేసిన సంస్థలు: నార్త్‌రోప్ గ్రమ్మన్, బాల్ ఏరోస్సేస్ – టెక్నాలజీస్
- దీనిలో అతిపెద్ద బంగారు పూత పూసిన 18 షట్కోణ ఫలకాల దర్పణం ఏర్పాటు చేశారు. ఈ దర్పణం వ్యాసం 6.5 మీటర్లు, హబుల్ దర్పణ వ్యాసం కన్నా ఇది దాదాపు రెండున్నర రెట్లు పెద్దది. 0.6– 28.3ఎం వరకు ఉన్న కాంతి కిరణాలను గమనించగలదు. అంటే ఇంతవరకు ఏ టెలిస్కోపు గమనించలేని వస్తువులను గుర్తిస్తుంది.
- ఆసక్తి ఉన్న సైంటిస్టులు డైరెక్టర్స్ డిస్క్రెషనరీ ఎర్లీ రిలీస్ సైన్స్(డిడి–ఇఆర్‌ఎస్) కార్యక్రమం, గ్యారెంటీడ్ టైమ్ అబ్జర్వేషన్స్(జిటిఓ) కార్యక్రమం, జనరల్ అబ్జర్వర్స్(జిఓ) కార్యక్రమాల ద్వారా ఈ టెలిస్కోపును వాడుకొని ఖగోళ పరిశోధన చేసేందుకు సమయాన్నిస్తారు.
చదవండి: ఒమిక్రాన్‌ను గుర్తించే కొత్త పరీక్షా విధానాన్ని రూపొందించిన ఐఐటీ?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్