JNU Researchers: మలేరియా అంతానికి ‘అలిస్పోరివిర్’
Sakshi Education
ఆడ ఆనాఫిలిస్ దోమకాటు వల్ల వచ్చే మలేరియా నివారణకు ఎన్నో ఔషధాలు అందుబాటులో ఉన్నా అది పూర్తిగా అంతం కావడం లేదు. ఔషధాలను తట్టుకొనేలా కొత్త శక్తి పొందుతూ వస్తోంది. దీనిపై ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ‘సెంటర్ ఫర్ మాలిక్యులార్ మెడిసిన్’ పరిశోధకులు దృష్టి సారించారు. డ్రగ్–రెసిస్టెంట్ మలేరియా రకాల భరతం పట్టడానికి యాంటీ–హెపటైటిస్ సి డ్రగ్ ‘అలిస్పోరివిర్’ను కనిపెట్టారు.
అవయవాల మార్పిడి ప్రక్రియలో ఉపయోగించే సైక్లోస్పోరిన్–ఎ డ్రగ్‌లో మార్పులు చేయడం ద్వారా దీన్ని సృష్టించారు. క్లోరోక్విన్–రెసిస్టెంట్, అరి్టమెసినిన్–రెసిస్టెంట్ మలేరియా రకాలపై ఇది చక్కగా పనిచేస్తుందని డాక్టర్ ఆనంద్ రంగనాథన్ చెప్పారు. ‘‘దీన్ని అరి్టమెసినిన్ డ్రగ్‌తో కలిపి వాడొచ్చు. ప్రీ క్లినికల్ పరీక్షలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది పూర్తిగా సురక్షితం’’ అని ప్రొఫెసర్ శైలజా సింగ్ తెలిపారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక ‘అలిస్పోరివిర్’ అందుబాటులోకి రానుంది. 2021లో మాస్కిరిక్స్ అనే యాంటీ–మలేరియా టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి మంజూరు చేసింది. మలేరియా నివారణకు టీకా రావడం మాత్రం ఇదే మొదటిసారి!
Published date : 21 Nov 2022 12:21PM