Defence Deal: సీ–295 విమానాల కొనుగోలుకు భారత్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది?
అత్యాధునిక సీ–295 సైనిక రవాణా విమానాల కొనుగోలు కోసం భారత రక్షణ శాఖ... ప్రఖ్యాత ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో సెప్టెంబర్ 24న ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు రూ.20వేల కోట్లతో 56 విమానాలను కొనుగోలుచేయనుంది. అవ్రో–748 ఎయిర్‌క్రాఫ్ట్‌ల స్థానంలో సీ–295 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ప్రవేశపెట్టనున్నారు.
టీఏఎస్‌ఎల్ భాగస్వామ్యంతో...
ఒప్పందంలో భాగంగా... ఎయిర్‌బస్ సంస్థ మొదట 16 విమానాలను స్పెయిన్‌లోని సెవిల్లేలో తయారు చేసి, ‘ఫ్లై–అవే’ కండీషన్‌లో భారత రక్షణ శాఖకు అప్పగిస్తుంది. మిగిలిన 40 విమానాలను భారత్‌లో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్(టీఏఎస్‌ఎల్) భాగస్వామ్యంతో తయారు చేస్తుంది. ఒక ప్రైవేట్ సంస్థ భారత్‌లో మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేస్తుండడం ఇదే తొలిసారి. 16 ఎయిర్‌క్రాఫ్ట్‌లను భారత రక్షణ శాఖకు అందజేస్తామని ఎయిర్‌బస్ ప్రకటించింది. భారత్‌లోనే అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్(ఈడబ్ల్యూఎస్)ను అన్ని విమానాల్లో అమర్చనున్నట్లు తెలిపింది.
ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి...
భారత్‌లో ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి తాజా ఒప్పందం మద్దతుగా నిలుస్తుందని ఎయిర్‌బస్ సీఈఓ మిఖాయిల్ షోయిల్‌హర్న్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో భారత్‌లో వచ్చే పదేళ్లలో 15,000 మందికి ప్రత్యక్షంగా, మరో 10,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు.
ఏమిటీ సీ–295?
సైనికుల చేరవేతకు, ఆయుధాలు, సైనిక సామగ్రి రవాణా కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. ఈ విమానాల నుంచి పారచూట్ల ద్వారా సైనికులను, సరుకులను నేలపైకి క్షేమంగా దింపవచ్చు. ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలతోపాటు సముద్రాలపై పెట్రోలింగ్ కోసం వాడొచ్చు. యుగోస్లావియా, అఫ్గానిస్తాన్, ఇరాక్, లెబనాన్ తదితర దేశాల్లో కీలక ఆపరేషన్లలో ఈ విమానాలు పాల్గొన్నాయి. ప్రపంచంలో ఈ విమానాల 35వ ఆపరేటర్‌గా భారత వైమానిక దళం రికార్డుకెక్కనుంది.
చదవండి: హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 56 సీ–295 సైనిక రవాణా విమానాల కొనుగోలుకు ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : భారత రక్షణ శాఖ
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు...