COVID-19 booster: జూలై 15 నుంచి 18–59 ఏళ్ల వారికి ఉచితంగా బూస్టర్ డోస్
కోవిడ్–19 టీకా బూస్టర్ డోసు పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 18–59 ఏళ్లవారికి ఉచితంగా పంపిణీ చేయనుంది. ప్రభుత్వ టీకా కేంద్రాల్లో బూస్టర్ డోసు పొందవచ్చు. 75 ఏళ్ల రోజులపాటే సాగే టీకా పంపిణీ ప్రత్యేక కార్యక్రమం జూలై 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా బూస్టర్ డోసును కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. దేశంలో 18–59 ఏళ్ల వయసు విభాగంలో 77 కోట్ల మంది ఉండగా, వీరిలో ఇప్పటిదాకా కేవలం ఒక శాతం లోపే బూస్టర్ డోసు తీసుకున్నారు. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నాక 6 నెలల తర్వాత శరీరంలో ప్రతిరక్షకాలు(యాంటీబాడీలు) తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలో చాలామంది 9 నెలల క్రితమే రెండో డోసు తీసుకున్నారు. రెండో డోసు, బూస్టర్ డోసు మధ్య వ్యవధిని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవలే 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశ జనాభాలో ఇప్పటిదాకా 96 శాతం మంది కరోనా టీకా మొదటి డోసు, 87 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. మన దేశంలో 18 ఏళ్లు దాటినవారికి కొంత రుసుముతో ప్రైవేట్ కేంద్రాల్లో బూస్టర్ డోసు పంపిణీ ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్ 10 నుంచి ప్రారంభమయ్యింది. అర్హులందరికీ బూస్టర్ డోసు ఉచితంగా ఇస్తూ నిర్ణయం తీసుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో కరోనాపై భారత్ పోరాటం మరింత బలోపేతం అవుతుందని, ప్రజల ఆరోగ్యానికి అదనపు భద్రత చేకూరుతుందని పేర్కొన్నాను.
Also read: Human Genome Sequence: మనిషిలో సుమారు ఎన్ని వేల జీన్స్ ఉంటాయి?