Chandrayaan-3 Success: చంద్రయాన్–3 ప్రయోగం సక్సెన్
25.3 గంటల కౌంట్‌డౌన్‌కు నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు తెర పడింది. ఆ వెంటనే ఇస్రో బాహుబలి ఎల్‌వీఎం3–ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది.
చంద్రయాన్–1, 2 ప్రయోగాలు నిరాశ పరిచినా పట్టు వీడకుండా మొక్కవోని దీక్షతో మన శాస్త్రవేత్తల బృందం రాత్రింబవళ్లు పడిన కష్టం ఎట్టకేలకు ఫలించింది. ముచ్చటగా మూడోసారి చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైంది. మూడు దశల ఎల్‌వీఎం3–ఎం4 రాకెట్ చంద్రయాన్–3 త్రీ–ఇన్–ఒన్ మిషన్‌ను విజయవంతంగా రోదసి చేర్చి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని మొదలుకుని ప్రముఖులంతా ఇస్రోను, ఇంతటి విజయానికి కారకులైన శాస్త్రవేత్తల బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు.
ప్రయోగం జరిగిందిలా..
► 640 టన్నులు, 43.43 అడుగుల పొడవున్న ఎల్‌వీఎం3–ఎం4 రాకెట్ 3,920 కిలోల చంద్రయాన్–3 మిషన్ మోసుకెళ్లింది.
► చంద్రయాన్–3లో 2,145 కిలోల ప్రొపల్షన్ మాడ్యూల్, 1,749 కిలోల ల్యాండర్ (విక్రమ్), 26 కిలోల రోవర్ (ప్రజ్ఞాన్)ల్లో ఆరు ఇండియన్ పేలోడ్స్, ఒక అమెరికా పేలోడ్ అమర్చి పంపారు.
► ఎల్‌వీఎం3–ఎం4 రాకెట్ తొలి దశలో ఇరువైపులా అత్యంత శక్తిమంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి దిగ్విజయంగా ప్రయాణం ప్రారంభించింది.
► ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 127 సెకెండ్లలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేశారు.
► ద్రవ ఇంజిన్ మోటార్లతో కూడిన రెండో దశ (ఎల్–110) 108.10 సెకన్లకే మొదలైంది.
► 194.96 సెకన్లకు రాకెట్ అగ్ర భాగాన అమర్చిన చంద్రయాన్–3 మిషన్ హీట్ షీల్డులు విజయవంతంగా విడిపోయాయి.
► 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 305.56 సెకన్లకు రెండోదశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు.
► అత్యంత కీలకమైన మూడో దశలో 307.96 సెకన్లకు క్రయోజనిక్ (సీ–25) మోటార్లను మండించారు. 954.42 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను విజయవంతంగా పూర్తి చేశారు.
► రాకెట్ అగ్ర భాగాన అమర్చిన త్రీ ఇన్ వన్ చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని ఈ దశలోనే 969 సెకన్లకు (16.09 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ)170 కిలోమీటర్లు, దూరంగా (అపోజి) 36,500 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ అర్బిట్ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.
☛☛ Chandrayaan-3 Count down starts: చంద్రయాన్–3 కౌంట్‌డౌన్ స్టార్ట్
► ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 4 గంటల సమయం తీసుకుంటుందని అంచనా.
► రోవర్ సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రుని రోజు–మన లెక్కలో 14 రోజులు) పని చేస్తుంది.
► ఆ 14 రోజుల వ్యవధిలో రోవర్ 500 మీ టర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై మూలమూలలనూ శోధించి భూ నియంత్రిత కేంద్రానికి కీలక సమాచారం చేరవేస్తుంది.
► ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో మనది నాలుగో స్థానం. గతంలో రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి.
► చంద్రయాన్–1తో ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది.
► చంద్రయాన్–2 ద్వారా ల్యాండర్, రోవర్‌తో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయాలని సంకల్పించగా ఆ ప్రయోగం దురదృష్టవశాత్తూ చివరి రెండు నిమిషాల్లో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్ అందకుండా పోయాయి. దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుని నిరంతరం శ్రమించి చంద్రయాన్–2 సాంకేతిక లోపాలను సరిదిద్దుకుని నాలుగేళ్ల తరువాత చంద్రయాన్–3ని దిగ్విజయంగా చంద్రుని కక్ష్యలోకి పంపారు.
చంద్రయాన్–3 మిషన్ మరో 41 రోజుల్లో, అంటే ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుని ఉపరితలంపై దిగుతుంది.
☛☛ chandrayyan-3 ready to launch: చంద్రయాన్–3 ప్రయోగానికి సిద్దం.. దీని ప్రత్యేకతలు ఇవే...