NITI Aayog ‘Export Preparedness Index Rankings 2022: నీతి ఆయోగ్ ఎగుమతుల సన్నద్ధత సూచీ 2022 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంతంటే..
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ విడుదల చేసిన 2022కు సంబంధించిన ర్యాంకుల్లో 59.27 పాయింట్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. గతేడాది తొమ్మిదో స్థానంలో ఉన్న మన రాష్ట్రం మరోస్థానం ఎగబాకింది.
ఈ ర్యాంకుల్లో 80.89 పాయింట్లతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిస్తే, ఆ తరువాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (78.20), కర్ణాటక (76.36), గుజరాత్ (73.22), హరియాణ (63.65), తెలంగాణ (61.36), ఉత్తరప్రదేశ్ (61.23) ఉన్నాయి. 2020లో 20వ స్థానంలో ఉన్న ఏపీ, కేవలం రెండేళ్లలో 12 స్థానాలను మెరుగుపర్చుకుని సత్తా చాటింది. ఇక కోస్తాతీరం కలిగిన రాష్ట్రాలు 8 ఉంటే ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచింది. ఎగుమతుల పాలసీలో 99.52 పాయింట్లతో 4వ స్థానం, ఎగుమతుల ఎకోసిస్టమ్‌లో 6వ స్థానం దక్కించుకుంది.
☛☛ Daily Current Affairs in Telugu: 18 జులై 2023 కరెంట్ అఫైర్స్
టాప్ 100లో రాష్ట్రం నుంచి 8 జిల్లాలు:
దేశం నుంచి 2021–22లో 422 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరగ్గా ఏపీ వాటా 4.58 శాతం (19 బిలియన్ డాలర్లు) ఉందని నివేదిక పేర్కొంది. 127 బిలియన్ డాలర్ల ఎగుమతులతో గుజరాత్ మొదటిస్థానంలో ఉంది. దేశం నుంచి అత్యధికంగా ఎగుమతులు జరుగుతున్న టాప్ 100 జిల్లాల్లో రాష్ట్రం నుంచి 8 ఉమ్మడి జిల్లాలకు చోటు దక్కింది.
అందులో విశాఖకు టాప్ 10లో తొమ్మిదో స్థానం దక్కగా ఉమ్మడి తూర్పుగోదావరికి 24వ స్థానం దక్కింది. ఎగుమతులు ఇన్‌ఫ్రాలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పనితీరు బాగుందని, అలాగే గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఎగుమతిదారులకు రుణ లభ్యతకూడా భారీగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
☛☛ Niti Aayog Rankings in Aspirational Districts: నీతి ఆయోగ్ టాప్ లిస్ట్‌లో వైఎస్సార్ జిల్లా