AP CM YS Jagan : ‘ఈబీసీ నేస్తం’ ద్వారా అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం.. అర్హులు వీరే
రాష్ట్రవ్యాప్తంగా 3,92,674 మంది అక్కచెల్లెమ్మలు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. ఇందుకు 589 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ పథకం కోసం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు మరో మంచి కార్యాక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. రాజ్యాంగ స్పూర్తిని అనుసరిస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు.
అర్హలు వీరే..
‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకం ద్వారా అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నామని పేర్కొన్నారు. అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్లు ఉన్నారు. వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈబీసీ నేస్తం పథకం తీసుకొచ్చినట్లు సీఎం వెల్లడించారు. ఈ పథకం ద్వారా రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, క్షత్రియ, వెలమ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు ఆర్థిక సాయ చేకూరుతుందని చెప్పారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం మహిళల ఆర్ధిక సాధికారిత, ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ...
సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే. ‘రిపబ్లిక్‌డేకు ఒకరోజు ముందు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మన దేశాన్ని మన రాజ్యాంగం ప్రకారమే మనల్ని మనం పాలించుకునే రోజు ప్రారంభమైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి రేపు 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. మన రాజ్యాంగ నిర్మాతలకు నిండు మనస్సుతో నివాళులు అర్పిస్తున్నాం. రాజ్యాంగం ఆశయాలను నెరవేరుస్తూ అడుగులు ముందుకేస్తున్నాం. రెండున్నరేళ్ల పరిపాలనలో ప్రతి అడుగూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకేస్తున్నాం. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.
దాదాపు 25లక్షల మందికి నాలుగేళ్లలో..
వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానం కాదు. మేనిఫెస్టోలో కూడా చెప్పలేదు. పేదవాడు ఎక్కడున్నా.. పేదవాడే. వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. ఇప్పటికే వైఎస్సార్ చేయూత ద్వారా 45–60 ఏళ్ల మధ్యనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన దాదాపు 25లక్షల మందికి నాలుగేళ్లలో రూ.75వేలు ఇస్తున్నాం. ప్రఖ్యాత కంపెనీలతో కలిసి వారికి అండగా నిలబడే ప్రయత్నం చేశాం. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా కాపు, బలిజ, ఒంటరి మహిళలకు 3.27లక్షల మందికి ప్రతిఏటా రూ.15వేల చొప్పున ఐదేళ్లపాటు ఇస్తున్నాం.
అమ్మ ఒడి ద్వారా 45 లక్షల మందికి పైగా...
ఈబీసీ పథకం ద్వారా పేదరికంలో ఉన్న దాదాపు 4 లక్షలమందికి ప్రతిఏటా రూ.15వేలు ఇస్తాం. 32–33 లక్షల మంది మంది అక్కచెల్లెమ్మలు మేలు చేస్తున్నాం. అమ్మ ఒడి ద్వారా 45 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మేలు. ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణాలను చెల్లిస్తున్నాం. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 32 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం. కోటి 25 లక్షల మందికి మేలు జరిగే గొప్ప కార్యక్రమం.
32 లక్షల జీవితాల్లో వెలుగులు..
రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి మేలు జరగుతోంది. ఇళ్ల నిర్మాణం కూడా చురుగ్గా సాగుతోంది. ఈ ఇళ్లన్నీ పూర్తయితే 32 లక్షల జీవితాల్లో వెలుగులు వస్తాయి. ప్రతి ఒక్కరికీ 5–10 లక్షల రూపాయల మేలు జరుగుతుంది. రూ.2 లక్షల పైచిలుకు ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇచ్చినట్టు అవుతుంది. పొదుపు సంఘాల్లోని మహిళలకు సున్నావడ్డీ అమలు చేస్తున్నాం. జగనన్న విద్యాదీవెన ద్వారా పిల్లల చదువులకు అయ్యే ఫీజులను వారి ఖాతాల్లోనే వేస్తున్నాం. జగనన్న వసతి దీవెన కూడా ఇస్తున్నాం. సంపూర్ణ పోషణ ద్వారా 34 లక్షల మందికి పైగా మంచి చేస్తున్నాం. సంవత్సరానికి రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.
తొలి మహిళాగా...
మహిళా సాధికారితకు రాజకీయంగా కూడా పెద్ద ప్రామఖ్యత ఇచ్చాం. శాసనమండలిలో తొలి మహిళా వైస్ ఛైర్మన్‌గా సోదరిగా జకియా ఖాన్‌ఉంది. ఉప ముఖ్యమంత్రిగా పాముల పుష్ప శ్రీవాణి, మహిళా హోంమంత్రి సుచరితమ్మ ఉంది. రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్నిని పెట్టాం. తొలి మహిళా ఎన్నికల అధికారిగా కూడా ఆమె ఉన్నారు. మన ప్రభుత్వంలో మనం వేసిన ముందడుగులు ఇవి. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 51శాతం ఇచ్చాం. ఏకంగా చట్టమే తీసుకు వచ్చాం’ అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.