Skip to main content

Global Terrorist: అంతర్జాతీయ ఉగ్రవాదిగా మక్కీ

పాకిస్తాన్‌ కేంద్రంగా భారత్‌పైకి ఉగ్రమూకలను ఉసిగొల్పుతున్న లష్కరే తోయిబా ఉగ్రసంస్థ డెప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్‌ మక్కీ(68)ని గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలంటూ భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పచ్చజెండా ఊపింది.

ఆయనను బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తున్నట్లు మండలి జ‌న‌వ‌రి 16న‌ ప్రకటించింది. దీంతో పాక్‌తో అంటకాగుతున్న మరో ఉగ్రమూక కీలక నేతను అంతర్జాతీయంగా ఆర్థిక కార్యకలాపాలు జరపకుండా నిరోధించడంలో ఐరాసలో భారత్‌ నెరిపిన దౌత్యం ఫలించింది. గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా ముద్రపడిన వ్యక్తుల ఆస్తుల స్వాధీనం, బ్యాంకింగ్, ఆర్థిక, ఆయుధాల కార్యకలాపాలకు అడ్డుకట్టపడుతుంది. 

Tehreek-i-Labbaik: ఉగ్రవాద సంస్థ టీఎల్‌పీపై నిషేధం ఎత్తివేసిన దేశం?

ప్రస్తుతం లష్కరే తోయిబా రాజకీయ వ్యవహారాల విభాగం చీఫ్‌గా ఉన్న మక్కీ ఆ ఉగ్రసంస్థ చీఫ్‌ హఫీజ్‌ ముహమ్మద్‌ సయీద్‌కు అత్యంత సమీప బంధువు. మక్కీ గతంలో లష్కరే తోయిబాలో వివిధ విభాగాల్లో పనిచేశాడు. ఆ సంస్థకు అంతర్జాతీయంగా నిధులు సమకూర్చే పనిలో బిజీగా ఉండేవాడు. ఉగ్రవాదం కోసం నిధుల సేకరణ, యువతను ఉగ్రవాదంవైపునకు ఆకర్షించడం, భారత్‌పై దాడి, ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో హింస, ఉగ్రదాడులకు తెగబడటం వంటివి పాల్పడినందుకు గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించినట్లు ఐరాస పేర్కొంది. ఇన్నాళ్లూ ఇతడిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడానికి ఒప్పుకోని చైనా చివర్లో అందుకు సమ్మతించడం గమనార్హం. ఐరాస చర్యను భారత్‌ స్వాగతించింది.
ఇంకా పొంచి ఉన్న ఉగ్రముప్పును ఎదుర్కోవడంలో, పరిస్థితి సద్దుమణిగేలా చేయడంలో ఇలాంటి చర్యలు అక్కరకొస్తాయని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదంపై పోరును భారత్‌ ఇకమీదటా కొనసాగిస్తుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందం బాగ్చీ స్పష్టంచేశారు. జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింపజేయడంలో 2019లో భారత్‌ సఫలీకృతమైంది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)

Published date : 18 Jan 2023 03:03PM

Photo Stories