Supreme Court Judges: ముగ్గురు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు వీడ్కోలు
జూన్ 16న జస్టిస్ కేఎం జోసెఫ్, జూన్ 17న జస్టిస్ అజయ్ రస్తోగి, జూన్ 29న జస్టిస్ వి.రామసుబ్రమణియన్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నెల 22 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నందున మే 19నే వీరికి చివరి పనిదినం అయింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ప్రత్యేక వీడ్కోలు సమావేశం ఏర్పాటైంది. ముగ్గురు న్యాయమూర్తులతో తనకు అనుబంధాన్ని సీజేఐ గుర్తుకు తెచ్చుకున్నారు. ‘జోసెఫ్ నాకు చిన్ననాటి స్నేహితుడు. 1972లో ఢిల్లీకి వచ్చిన కొత్తలో నా మొట్టమొదటి స్నేహితుడు. అటువంటి వ్యక్తి రిటైరవుతుండటంతో నా విచారం రెట్టింపయింది’అని పేర్కొన్నారు.
ఒకే ధర్మాసనంలో జస్టిస్ జోసెఫ్‌తో కలిసి పనిచేయడం సంతోషదాయకమన్నారు. రాజ్యాంగ చట్టాలు మొదలుకుని వాణిజ్య చట్టాల వరకు ఎంతో పట్టున్న జస్టిస్ కేఎం జోసెఫ్ సేవలను ఇకపై తాము మిస్ అవుతున్నామన్నారు. సామాన్యుడికి కూడా న్యాయం అందాలంటే బార్ సహాయం ఎంతో అవసరమని జస్టిస్ జోసెఫ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2018 ఆగస్ట్‌లో సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ జోసెఫ్ బాధ్యతలు చేపట్టారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)
జస్టిస్ అజయ్ రస్తోగి గొప్ప మిత్రుడు
సున్నితత్వం, దయా గుణం కలిగిన జస్టిస్ అజయ్ రస్తోగి తనకు గొప్ప మిత్రుడని సీజేఐ కొనియాడారు. సివిల్, కార్మిక చట్టాలు వంటి అనేక అంశాల్లో తరచూ జస్టిస్ రస్తోగి విశేష పరిజ్ఞానంపైనే ఆధారపడే వాడినన్నారు. ‘బ్రదర్ రస్తోగి, తీర్పు రాసిన జడ్జీ్జల్లో మీ పేరు కనిపిస్తే చాలా ప్రశాంతత, భరోసాతో ఉండే వాడిని’అని తెలిపారు. కొలీజియం సమావేశాల్లో తనకు ఎంతో మద్దతుగా నిలిచేవారన్నారు. 1958లో జన్మించిన జస్టిస్ రస్తోగి 2018 నవంబర్‌లో సుప్రీం జడ్జిగా నియమితులయ్యారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి జస్టిస్ రామసుబ్రమణియన్
జస్టిస్ రామసుబ్రమణియన్ వినయశీలి, బహుముఖ ప్రతిభావంతుడైన న్యాయమూర్తి, మానవతా వాదిగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కొనియాడారు. ‘రిటైరయ్యాక ఏదైనా ట్రిబ్యునల్‌కు చైర్మన్ పదవిని చేపట్టాలని జస్టిస్ రామ్‌ని కోరగా తిరస్కరించారు. అయినా నా ప్రయత్నం మానను’’ అని సీజేఐ అన్నారు. 2006 నుంచి మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ సుబ్రమణియన్ 2016లో ఉమ్మడి ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అనంతరం తెలంగాణ హైకోర్టు జడ్జిగా కొనసాగారు. 2019లో హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజేగా పదోన్నతిపై వెళ్లారు. అదే ఏడాది సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.
Supreme Court: జనం మనసుల్లోకి సుప్రీంకోర్టు.. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్