Shelly Oberoi: ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్
బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై ఆప్ మహిళా అభ్యర్థి షెల్లీ ఓబెరాయ్ 34 ఓట్ల తేడాతో నెగ్గి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. 266 ఓట్లు పోలవగా షెల్లీకి 150, గుప్తాకు 116 ఓట్లు దక్కాయి. నామినేటెడ్ సభ్యులకూ ఓటింగ్ హక్కు ఉందంటూ బీజేపీ కార్పొరేటర్లు వాదించడం, అందుకు ఒప్పుకునేది లేదంటూ మెజారిటీ సభ్యులైన ఆప్ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగడంతో ఢిల్లీలోని సివిక్ సెంటర్ భవనంలో మేయర్, డెప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ గతంలో మూడుసార్లు అర్ధంతరంగా వాయిదాపడింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (22-28 జనవరి 2023)
మేయర్ ఎన్నికలపై తేల్చాలంటూ ఆప్ అభ్యర్థి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జీ) వీకే సక్సేనా నామినేట్ చేసిన సభ్యులకు ఓటింగ్ హక్కులు ఉండబోమని సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 17న తేల్చిచెప్పడంతో మేయర్ ఎన్నిక కోసం సభను సమావేశపరచాలని ఎల్‌జీ ఆదేశాలివ్వడం, ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి జయకేతనం ఎగరేయడం చకచకా జరిగిపోయాయి. డెప్యూటీ మేయర్‌గా ఆప్ అభ్యర్థి అలే మొహమ్మద్ ఇక్బాల్ గెలిచారు. ఎంసీడీ తొలి మేయర్‌గా ఎన్నికైన 39 ఏళ్ల షెల్లీ ఆప్ మహిళా అభ్యర్థిగా తూర్పు పటేల్‌నగర్ వార్డు నుంచి గెలిచారు. గతంలో ఈమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఇగ్నోలో డాక్టరేట్ చేశారు. ఇండియన్ కామర్స్ అసోసియేషన్(ఐసీఏ)లో బంగారు పతకం సాధించారు.