Heeraben: మోదీకి మాతృవియోగం.. భావోద్వేగానికి గురైన ప్రధాని
హీరాబెన్‌కు ప్రధాని మోదీ సహా అయిదుగురు కుమారులు సోమాబాయ్, అమృత్, ప్రహ్లాద్, పంకజ్, కుమార్తె వాసంతిబెన్ ఉన్నారు. గాంధీనగర్ శ్మశాన వాటికలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అంత్యక్రియలు ముగిశాయి. హీరాబెన్ మరణవార్త విన్న ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మోదీకి సంతాపం తెలిపారు.
ప్రపంచ నేతల సంతాపం
ప్రపంచ దేశాల అధినేతలు కూడా ప్రధాని మోదీకి సంతాపం తెలియజేశారు. జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, నేపాల్ ప్రధాని ప్రచండ, పాకిస్తాన్ ప్రధానిమంత్రి షెబాజ్ షరీఫ్‌లు ట్విటర్ వేదికగా సంతాపాన్ని తెలియజేశారు. ‘‘తల్లిని కోల్పోవడం కంటే మించిన లోటు ప్రపంచంలో ఏదీ ఉండదు. భారత ప్రధాని మోదీకి సంతాపం తెలియజేస్తున్నాను’’ అని పాక్ ప్రధాని షరీఫ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Sulochana Chavan: ప్రముఖ గాయని సులోచనా చవాన్ కన్నుమూత
తల్లీ.. నిను తలంచి...!
తల్లి గురించి ప్రధాని మోదీ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. ‘‘నా తల్లి వందేళ్ల గొప్ప ప్రయాణాన్ని పూర్తి చేసుకొని భగవంతుడి పాదాల చెంతకు చేరారు. ఆమెలో నాకు ఎప్పుడూ మూడు గొప్ప సుగుణాలు కనిపిస్తాయి. తపస్సులాంటి జీవితం, నిస్వార్థపర సేవా తత్వం, విలువలకు కట్టుబడి జీవితం. ఇలా ఆమెలో త్రిమూర్తులు కనిపిస్తారు. 100వ పుట్టిన రోజు నాడు అమ్మను కలిసినప్పుడు ఆమె నాతో ‘నీ బుద్ధి చెప్పినట్టుగా పని చేయి. పరిశుద్ధంగా జీవితాన్ని గడుపు’ అని చెప్పారు. ఆ మాటలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’’ అన్నారు. గత జూన్‌లో హీరా బెన్ 100వ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఆమె గురించి మోదీ తన బ్లాగ్‌లో రాసుకున్నారు. ‘‘సాదాసీదా జీవితం గడిపినా ఆమె ఒక అసాధారణ మూర్తి. మేం ఆరుగురు పిల్లలం. మమ్మల్ని పెంచేందుకు ఎంతో కష్టపడింది. పరిశుభ్రతకు ప్రాణమిచ్చేది. అదే సమయంలో సామాజిక బాధ్యతలనూ నెరవేర్చింది. పంచాయతీ నుంచి లోక్‌సభ దాకా ప్రతి ఎన్నికల్లోనూ విధిగా ఓటేసింది. గుజరాత్ సీఎం అయ్యాక తొలిసారిగా తన ఆశీర్వాదం కోసం వెళ్తే అవినీతికి పాల్పడొద్దని ఒకే సలహా ఇచ్చింది’’ అని గుర్తు చేసుకున్నారు. మొత్తం ఆరుగురు సంతానంలో మోదీ మూడోవారు.
Mrs World 2022: మిసెస్ వరల్డ్‌గా సర్గమ్ కౌశల్
అగ్ర రాజ్య వేదికపైనా..
2015లో అమెరికాలో పర్యటించిన మోదీ సిలికాన్ వ్యాలీలో ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తన తల్లి గొప్పదనాన్ని, ఆమె అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనైన తీరు ఆహూతులతోనూ కంటతడి పెట్టించింది. మీ జీవితంలో తల్లి పాత్ర ఏమిటన్న ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రశ్నకు బదులిచ్చే క్రమంలో ప్రదాని కన్నీళ్లపర్యంతమయ్యారు. ‘‘మమ్మల్ని పెంచేందుకు అమ్మ ఇరుగుపొరుగు ఇళ్లలో అంట్లు తోమడం, నీళ్లు పట్టడం వంటి ఎన్నో పనులు చేసింది’’ అంటూ ఆమె ఎదుర్కొన్న కష్టాలను, వాటిని అధిగమించడంలో కనబరిచిన మనో నిబ్బరాన్ని గద్గద స్వరంతో వివరించారు. ‘‘అమ్మకిప్పుడు 90 ఏళ్లు దాటినా అన్ని పనులూ తానే చేసుకుంటుంది. అక్షర జ్ఞానం లేకపోయినా టీవీలో వార్తలు చూసి ప్రపంచంలో ఏం జరుగుతున్నదీ తెలుసుకుంటూ ఉంటుంది’’ అని చెప్పారు.