Neiphiu Rio: నాగాలాండ్ సీఎంగా ఐదోసారి రియో

ఆయనతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంలుగా, మరికొందరు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. వీరిలో ఎన్‌డీపీపీకి చెందిన ఏడుగురు, బీజేపీ నుంచి ఐదుగురు ఉన్నారు. వీరిలో మహిళా ఎమ్మెల్యే క్రూసె కూడా ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా ఎన్నికైన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల్లో క్రూసె ఒకరు. మార్చి 7వ తేదీ గవర్నర్ లా గణేశన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
రాష్ట్ర అసెంబ్లీలోని 60 స్థానాలకు గాను ఇటీవలి ఎన్నికల్లో ఎన్‌డీపీపీ–బీజేపీ కూటమి 37 చోట్ల విజయం సాధించింది. రియో ప్రభుత్వానికి ఇతర పార్టీలు కూడా మద్దతు తెలుపుతూ లేఖలు అందజేశారు. దీంతో, ప్రతిపక్షం లేని అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వానికి సీఎం రియో నాయకత్వం వహించనున్నారు.
రియో మొదటిసారిగా 2003లో నాగాలాండ్ సీఎం అయ్యారు. మళ్లీ 2008, 2013ల్లో కూడా సీఎం పదవి చేపట్టారు. 2014లో రాజీనామా చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మళ్లీ 2018లో సీఎం అయ్యారు. నాలుగు పర్యాయాలు సీఎంగా ఉన్న ఎస్‌సీ జమీర్ õరికార్డును తాజాగా బద్దలు కొట్టారు.