Skip to main content

Millet Man: మిల్లెట్‌ మ్యాన్‌ పీవీ సతీష్‌ కన్నుమూత

నలభై ఏళ్ల క్రితం డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డీడీఎస్‌)ని స్థాపించి, పాత పంటలు, సంప్రదాయ పంటలు, చిరుధాన్యాల సంరక్షణను ఉద్యమంలా చేపట్టి తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌గా పేరుగాంచిన పీవీ సతీష్‌ (77) మార్చి 19న హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో కన్నుమూశారు.
Millet Man PV Satheesh

దేశ వ్యాప్తంగా మిల్లెట్‌ పునరుద్ధరణకు ఆయన శ్రమించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం పస్తాపూర్‌ కేంద్రంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. మహిళా రైతులతో కలిసి పాత పంటల పరిరక్షణ కోసం 1983 నుంచి కృషి చేస్తూనే, వారితోనే సంప్రదాయ పంటలు, వాటి ఆవశ్యకత గురించి కమ్యూనిటీ రేడియోను ప్రారంభించారు. వారు స్థాపించిన సొసైటీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా యునైటెడ్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలలో ఈక్వేటర్‌ ప్రైజ్‌ను గెలుచుకుంది. 
ప్రతీ సంక్రాంతికి ‘పాత పంటల జాతర’ను సతీష్‌ నిర్వహిస్తున్నారు. చిరుధాన్యాలను ప్రజల ఎజెండాగా చేయడంలో ఆయన జీవితకాల కృషికి ఇటీవల పురస్కారం లభించింది. డీడీఎస్‌ సంస్థకు పలు అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక వృక్షమిత్ర అవార్డు సైతం సాధించింది. 

Global Millets Conference: ఆహార సంక్షోభానికి చిరుధాన్యాలే పరిష్కారం..  మోదీ

తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌గా గుర్తింపు పొందిన పెరియపట్నం వెంకట సుబ్బయ్య సతీశ్‌ 1945వ సంవత్సరం జూన్‌ 18న మైసూర్‌లో జన్మించారు. న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ పూర్తిచేసి జర్నలిస్టుగా జీవితం ప్రారంభించారు. సుమారు రెండు దశాబ్దాల పాటు అగ్రగామి టెలివిజన్‌ నిర్మాతగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ అక్షరాస్యతకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించారు. 1970లో చారిత్రక ఉపగ్రహ బోధనా టెలివిజన్‌ ప్రమోగం(ఎస్‌ఐటీఈ)లో ముఖ్యమైన పాత్ర పోషించారు. 1980 కాలంలో సతీష్‌ కొంతమంది మిత్రులతో కలిసి జహీరాబాద్‌ ప్రాంతంలో డీడీఎస్‌ సంస్థను ప్రారంభించారు. భారత దేశ మొట్ట మొదటి కమ్యూనిటీ మీడియా ట్రస్ట్‌ను ప్రారంభించిన ఘనత కూడా ఆయనకే దక్కింది. నిరక్షరాస్యులైన దళిత మహిళలను ప్రోత్సహించి వారికి మీడియా, వీడియో రంగంలో శిక్షణ ఇప్పించారు. 

Longest Railway Platform: ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌ జాతికి అంకితం

 
గడ్డి మొలకెత్తని పొలాల్లో సిరులు పండేలా చేశారు..
ఎర్ర మొరం మట్టి నేలల్లో గడ్డికూడ మొలకెత్తని పరిస్థితి ఉండేది. ఏ గ్రామంలో చూసినా మహిళలు, వృద్ధులు తప్ప రైతులు కనిపించేవారు కాదు. ఇదంతా దూరదర్శన్‌లో పనిచేస్తున్న సమయంలో పి.వి.సతీష్‌ గమనించారు. తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి జహీరాబాద్‌ వచ్చారు. ఎర్ర మట్టిలో సారం నింపి, సొంత విత్తనాలు నాటాలని చెప్పారు. దీంతో మహిళలు అతని వెంట పలు గు, పార పట్టుకొని నడిచారు. జహీరాబాద్‌ చుట్టూ విసిరేసినట్లు ఉండే ఎల్గోయి, రేజింతల్, పస్తాపూర్, జీడిగడ్డతండా, ఖాశీంపూర్, పొట్‌పల్లి, చిల్కెపల్లి వంటి 30 గ్రామాల్లో ఆరువేల మంది ఆడబిడ్డలు మిల్లెట్స్‌ని ఒక ఉద్యమంగా పండిస్తున్నారు.
వారు అక్కడితోనే ఆగలేదు. సొంత విత్తనాలతో సీడ్‌ బ్యాంకు ఏర్పాటు చేసుకున్నారు. ఆర్గానిక్‌ ఎరువులు, గానుగ నూనెలు తయారు చేస్తున్నారు. బ్రెడ్‌ నుంచి అరిసెల వరకు చిరు ధాన్యాలతో అరుదైన 60 రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. సొంతంగా మిల్లెట్‌ రెస్టారెంట్‌ సైతం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలోకి ప్రవేశిస్తున్న హైబ్రీడ్‌ విత్తనాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి పంటల సాగును వ్యతిరేకిస్తూ పలు ఉద్యమాలు చేశారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )

Published date : 20 Mar 2023 05:23PM

Photo Stories