Mohammed Faizal: లక్షద్వీప్ ఎంపీకి పదేళ్ల ఖైదు
పదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి కె.అనిల్‌కుమార్ తీర్పు చెప్పారు. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీఎం సయీద్ అల్లుడైన పదాంత సాలిహ్‌ను హత్య చేయడానికి ఫైజల్ మరో ముగ్గురు ప్రయత్నించినట్టు కేసు నమోదైంది. రాజకీయ కక్షలతోనే సాలిహ్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారని, అయితే అందులో వారు విఫలమయ్యారని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పు నేపథ్యంలో ఎంపీ ఫైజల్ సహా దోషులు నలుగురిని కేరళలోని కన్నూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ తీర్పుతో ఫైజల్ రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్‌సీపీకి చెందిన నేత ఫైజల్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో ఆయనపై అనర్హత వేటు పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. 2009లో ఫైజల్ మరి కొంత మందితో కలిసి పదునైన ఆయుధాలతో సాలిహ్‌పై దాడి చేశారు. కత్తులు, కటారులు, కర్రలు, ఐరన్ రాడ్లతో కలిసి అతనిని వెంబడించి కొట్టారు. తీవ్రంగా గాయపడిన సాలిహ్‌ని ప్రత్యేక హెలికాప్టర్‌లో ఎర్నాకులం ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.