Charanjit Singh Channi: పంజాబ్ సీఎంగా ప్రమాణం చేసిన తొలి దళితుడు?
పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 20న చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో చన్నీతో రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణం చేయించారు. దీంతో పంజాబ్ సీఎంగా ప్రమాణం చేసిన తొలి దళిత నేతగా 49 ఏళ్ల చన్నీ గుర్తింపు పొందారు. చన్నీ తర్వాత కాంగ్రెస్ నేతలు సుఖిందర్ ఎస్ రంధ్వానా, ఓపీ సోని ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో... చన్నీ సీఎంగా ఎంపికయ్యారు. పంజాబ్‌లో మరో ఐదు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి.
ఎవరీ చన్నీ?
దళిత సిక్కు నాయకుడు చన్నీ 1972 ఏప్రిల్ 2న పంజాబ్‌లోని మక్రోనా కలాన్ గ్రామంలో జన్మించారు. దళితుల్లో రామదాసియా సిక్కు (చర్మకారులు) వర్గానికి చెందిన ఆయన పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. జలంధర్‌లోని పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీలో ఎంబీఏ, చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. హ్యాండ్‌బాల్ క్రీడలో ప్రావీణ్యం కలిగిన చన్నీ... ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ మీట్‌లో బంగారు పతకం సాధించాడు.
మున్సిపల్ కౌన్సిలర్ నుంచి...
చన్నీ తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా 2007లో చామ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం(రూప్‌నగర్ జిల్లా) నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012, 2017లోనూ అదే స్థానం నుంచి వరుసగా గెలిచారు. అంతకంటే ముందు మూడు పర్యాయాలు ఖరారా మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలిచారు. రెండుసార్లు కౌన్సిల్ అధ్యక్షుడిగా పని చేశారు. 2015–16లో పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2017 మార్చిలో అమరీందర్ ప్రభుత్వంలో సాంకేతిక విద్య, పారిశ్రామిక శిక్షణ, ఉద్యోగ కల్పన, పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
చదవండి: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ నేత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పంజాబ్ సీఎంగా ప్రమాణం చేసిన తొలి దళితుడు?
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : చరణ్‌జిత్ సింగ్ చన్నీ
ఎక్కడ : రాజ్‌భవన్, చండీగఢ్
ఎందుకు : సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో...