Skip to main content

BJP MLA Bhupendra Patel: గుజరాత్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేత?

గుజరాత్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్‌(59) ఎన్నికయ్యారు.
Bhupendra Patel

సెప్టెంబర్‌ 12న గుజరాత్‌ రాజధాని నగరం గాంధీనగర్‌లో సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 112 మంది బీజేపీ సభ్యులున్నారు. తదుపరి సీఎంగా భూపేంద్ర పేరును సెప్టెంబర్‌ 11న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విజయ్‌ రూపానీ ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. భూపేంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా సెప్టెంబర్‌ 13న ప్రమాణం చేయనున్నారు.

భూపేంద్ర రజనీకాంత్‌ భాయి పటేల్‌...

1962, జూలై 15న జన్మించిన భూపేంద్ర పటేల్‌ పూర్తిపేరు భూపేంద్ర రజనీకాంత్‌ భాయి పటేల్‌. అహ్మదాబాద్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేసిన ఆయన 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్లోడియా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. భూపేంద్ర ఎమ్మెల్యేగా నెగ్గడం ఇదే మొదటిసారి. మంత్రిగా పని చేయకుండానే సీఎం పదవిని చేపట్టబోతున్నారు.

చ‌దవండి: ఉత్తరాఖండ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన ఆర్మీ అధికారి?

వార్డు కౌన్సిలర్‌గానూ...

1999 నుంచి 2000 దాకా మేమ్‌నగర్‌ నగర పాలిక అధ్యక్షుడిగా పనిచేసిన భూపేంద్ర... 2008 నుంచి 2010 దాకా అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్కూల్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. 2010 నుంచి 2015 వరకూ అహ్మదాబాద్‌లోని థాల్టెజ్‌ వార్డు కౌన్సిలర్‌గానూ పనిచేశారు. అహ్మద్‌బాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా, అహ్మదాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా సేవలందించారు. పాటిదార్‌ సంస్థలైన సర్దార్‌ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్‌ ట్రస్టీగా కూడా పనిచేస్తున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : గుజరాత్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేత?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 12
ఎవరు    : భూపేంద్ర రజనీకాంత్‌ భాయి పటేల్‌ 
ఎందుకు  : గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి విజయ్‌ రూపానీ రాజీనామా చేసిన నేపథ్యంలో...
 

 

Published date : 13 Sep 2021 03:39PM

Photo Stories