Toll Plaza Charges: వాహనదారులకు షాక్.. ఏప్రిల్ ఒకటి నుంచి పెరగనున్న ‘టోల్’ చార్జీలు..!
పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్‌హెచ్ఏఐ అధికారులు తెలిపారు. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (ద్వి, త్రిచక్ర వాహనాలు మినహా) టారిఫ్ ధరలను 10 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పెరగనున్నాయి.
ఏడాదికోసారి సవరణ..
2008 నేషనల్ హైవేస్ ఫీజ్ ప్రకారం టోల్ చార్జీలను ఏడాదికోసారి కేంద్ర రవాణ శాఖ సవరిస్తుంటుంది. ప్రస్తుత పరిస్థితులు, ఆయా రహదారిపై ప్రయాణించే వాహనాల సంఖ్య, గతంలో వసూలైన రుసుముల ఆధారంగా ధరలను సవరిస్తారు. ఈ ప్రతిపాదనను కేంద్ర రోడ్డు, రవాణాశాఖకు ఎన్‌హెచ్ఏఐ పంపుతుంది. దీనిపై ప్రభుత్వం నిపుణుల అభిప్రాయాలు తీసుకుని మార్చి నెల చివరన నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం కార్లు, తేలికపాటి వాహనాలపై ఒక్కో ట్రిప్పుకు ఐదు శాతం, భారీ వాహనాలకు టోల్ టాక్స్ అదనంగా 10 శాతం పెరిగే అవకాశం ఉంది.