Skip to main content

Centre vs Collegium : ఇబ్బందికరంగా కేంద్రం తీరు.. కొలీజియం సిఫార్సుల పెండింగ్‌పై సుప్రీం

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గత డిసెంబర్లో కొలీజియం సిఫార్సు చేసిన ఐదు పేర్లను త్వరలో ఆమోదించనున్నట్టు కేంద్రం పేర్కొంది.

రాజస్తాన్, పట్నా, మణిపూర్‌ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్, జస్టిస్‌ సంజయ్‌కరోల్, జస్టిస్‌ పి.వి.సంజయ్‌ కుమార్‌తో పాటు పట్నా హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అష్నదుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా వీరిలో ఉన్నారు. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పె డుతున్న వైనంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్, జస్టిస్‌ ఏఎస్‌ ఓకా ధర్మాసనానికి అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ ఈ మేరకు సమాచారమిచ్చారు. ‘‘ఆ ఐదు సిఫార్సులు గత డిసెంబర్‌ 13న చేసినవి. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది’’ అని ధర్మాసనం గుర్తు చేయగా, ఆదివారానికల్లా నియామక ఉత్తర్వులు రావచ్చని బదులిచ్చారు. 
కోర్టులపై దాడి పరిపాటైంది: జస్టిస్‌ కౌల్‌ 
కొలీజియం సిఫార్సులను తొక్కిపడుతున్న తీరుపై ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల సిఫార్సు సంగతేమిటని ప్రశ్నించింది. అందుకు ఇంకాస్త సమయం పడుతుందని ఏజీ చెప్పగా మండిపడింది. ‘‘ఇది చాలా చాలా సీరియస్‌ అంశం. ఈ విషయంలో కేంద్రం వైఖరి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోంది. బదిలీ సిఫార్సులను కూడా పెండింగ్‌లో పెడితే మేమింకేం చేయాలని మీరు ఆశిస్తున్నట్టు? మీరు ఉత్తర్వులిచ్చే దాకా సదరు న్యాయమూర్తులు చేతులు ముడుచుకుని కూర్చోవాలా? మీరదే కోరుకుంటున్నారా?’’ అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ‘‘ఈ విషయంలో మేం ఒక వైఖరికి వచ్చి అతి కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. అది అంతిమంగా అందరికీ చాలా అసౌకర్యంగా ఉంటుంది’’ అంటూ ఏజీని హెచ్చరించింది. ‘‘హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల్లో జాప్యాన్ని అస్సలు అనుమతించేది లేదు. ఎందుకంటే ఈ విషయంలో కేంద్రం పాత్ర అతి స్వల్పం.

Supreme Court: వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఉద్యోగుల‌కు నో పే స్కేల్‌ రివిజన్


ఈ విషయమై ఎవరో మూడో శక్తి మాతో ఆటలాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోం. మీ జాప్యం వల్ల న్యాయ, పాలనపరమైన విధులకు విఘాతం కలగడం అస్సలు ఆమోదనీయం కాదు’’ అంటూ మండిపడింది. ‘‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఒక న్యాయమూర్తి పేరును కొలీజియం సిఫార్సు చేస్తే ఇప్పటిదాకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మరో 19 రోజుల్లో ఆయన రిటైరవుతున్నారు. సీజే అవకుండానే రిటైరవాలని మీరు ఆశిస్తున్నట్టా?’’ అని నిలదీసింది. ఇది తమ దృష్టిలో ఉందని, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఏజీ బదులిచ్చినా సంతృప్తి చెందలేదు. ‘‘కొలీజియం సిఫార్సులను ఒక్కోసారి రాత్రికి రాత్రే ఆమోదిస్తున్నారు. మరికొన్నిసార్లు విపరీతంగా జాప్యం చేస్తున్నారు’’ అంటూ తీవ్రంగా తప్పుబట్టింది. కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లనూ పెండింగ్‌లో పెడుతున్నారని న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టులపై బయట తీవ్ర దాడికి పాల్పడుతున్నారని మరో న్యాయవాది ఆరోపించగా వీటికి అలవాటు పడిపోయామని జస్టిస్‌ కౌల్‌ ఆవేదన వెలిబుచ్చారు. విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేశారు.
కొలీజియం విషయమై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనడం తెలిసిందే. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పెట్టడం దాన్ని మరింత పెంచింది. తాజాగా అలహాబాద్, గుజరాత్‌ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని కొలీజియం జనవరి 31న సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 27 మందే ఉన్నారు.

Supreme Court: సుప్రీం జడ్జీలుగా అలహాబాద్, గుజరాత్‌ హైకోర్టు సీజేలు

Published date : 04 Feb 2023 12:31PM

Photo Stories