Skip to main content

Supreme Court: అరుణ్‌ గోయల్‌ను మెరుపు వేగంతో ఎందుకు నియమించారు..?

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ను మెరుపు వేగంతో నియమించడం వెనుక మతలబు ఏమిటని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆయన నియామకానికి సంబంధించిన ఫైల్‌ను కేవలం 24 గంటల వ్యవధిలోనే ఆగమేఘాలపై ఎందుకు ఆమోదించారని నిలదీసింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీ) నియామకం కోసం కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ అపాయింట్‌మెంట్‌కు సంబంధించిన ఒరిజినల్‌ ఫైల్‌ను కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి కోర్టుకు సమర్పించారు. ఈ ఫైల్‌ను ధర్మాసనం క్షుణ్నంగా పరిశీలించింది.
‘‘ఇదేం నియామకం? ఇదేం పద్ధతి? అరుణ్‌ గోయల్‌ సామర్థ్యాన్ని మేం ప్రశ్నించడం లేదు. ఆయనను ఎన్నికల కమిషనర్‌గా నియమించేందుకు అనుసరించిన ప్రక్రియనే ప్రశ్నిస్తున్నాం. 1985 బ్యాచ్‌ ఐఏఎస్‌ అయిన అరుణ్‌ గోయల్‌ ఒక్కరోజులో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఈసీగా గోయల్‌ అపాయింట్‌మెంట్‌ ఫైల్‌ను ఎందుకంత హడావుడిగా, అత్యంత వేగంగా ఆమోదించాల్సి వచ్చింది? ఫైల్‌ను ప్రారంభించిన రోజే ఆయనను ఎలా నియమించారు? ఈసీ పదవి కోసం న్యాయ శాఖ నలుగురి పేర్లతో జాబితా రూపొందించింది. దాన్ని ప్రధాని ఆమోదం కోసం ఈ నెల 18న పీఎంఓ పంపించింది. ప్రధాని అదే రోజు ఆ జాబితాలోని ఒక పేరును ప్రతిపాదించారు. నలుగురిలో గోయల్‌ను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు. అందుకు అనుసరించిన పద్ధతి ఏమిటి?’’ అని ప్రశ్నించింది.  
ప్రతిభావంతులకు తలుపులు మూసేస్తారా?  
­కేంద్ర న్యాయ శాఖ సిఫార్సు చేసిన నలుగురిలో ఒక్కరు కూడా పూర్తి కాలం(ఆరేళ్లు) ఎన్నికల కమిషనర్‌గా పదవిలో కొనసాగలేరని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. పదవీ విరమణ చేసిన(మాజీ) అధికారుల పేర్లనే ఎందుకు సిఫార్సు చేశారు? ప్రతిభావంతులైన యువ అభ్యర్థులకు ఎందుకు తలుపులు మూసేశారు? అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీఈసీ, ఈసీల నియామకంలో ప్రభుత్వం చట్ట ప్రకారం నడుచుకోవాలని తాము ఆశిస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికల సంఘం చట్టం–1991 ప్రకారం.. ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం ఆరేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చేదాకా పదవిలో ఉండొచ్చు. ఈ రెండింటిలో ఏది ముందైతే అదే అమలవుతుంది. అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి స్పందిస్తూ.. గోయల్‌ నియామకం విషయంలో మొత్తం ప్రక్రియను మాత్రమే చూడాలని కోరారు. గోయల్‌ పనితీరును మాత్రమే పరిశీలించాలని, స్వచ్ఛంద పదవీ విరమణ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తాను వాదిస్తున్న సమయంలో సీనియర్‌ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా, ‘కొద్దిసేపు మాట్లాడకుండా ఉంటారా?’ అని అటార్నీ జనరల్‌ సూచించారు.   
తీర్పు రిజర్వ్‌  
ఎన్నికల సంఘంలో సంస్కరణలు, స్వయం ప్రతిపత్తి వంటివి కోరుతూ దాఖలైన పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం నాలుగు రోజులపాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ పిటిషన్లపై తన తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు న‌వంబ‌ర్ 24న ప్రకటించింది. ఐదు రోజుల్లోగా లిఖితపూర్వకంగా వాదనలు తెలియజేయాలని వాద, ప్రతివాదులకు సూచించింది. సీఈసీ, ఈసీల నియామకం కోసం స్వతంత్ర ప్యానెల్‌ ఏర్పాటు చేయాలా? వద్దా? అనే దానిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం త్వరలో తీర్పు వెలువరించనుంది. తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

World Population : పెరుగుతున్న జనాభా.. ఎన్నో సవాళ్ళు.. సదవకాశాలు

Published date : 25 Nov 2022 02:58PM

Photo Stories