Supreme Court: బహుభార్యత్వంపై రాజ్యాంగ ధర్మాసనం
Sakshi Education
ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా హలాలా వంటి ఆచారాల రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనుంది.
ఈ అంశాలపై విచారణకు గతంలో ఏర్పాటు చేసిన ధర్మాసనంలోని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ హేమంత్ గుప్తా రిటైరయినందున తాజాగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలంటూ లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ చేసిన వినతిపై ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ జేబీ పార్దివాలాల ధర్మాసనం గురువారం సానుకూలంగా స్పందించింది. త్వరలో ఈ మేరకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సీజేఐ పేర్కొన్నారు. ఒక ముస్లిం వ్యక్తి నలుగురు వరకు భార్యలను కలిగి ఉండేందుకు ఇస్లాం అనుమతిస్తోంది. అదేవిధంగా, విడాకులు పొందిన స్త్రీ, తిరిగి మాజీ భర్తను వివాహమాడాలంటే.. ముందు ఆమె మరొకరిని వివాహం చేసుకోవాలి, ఆ తర్వాత అతడికి విడాకులివ్వడమే నిఖా హలాలా ఆచారం.
➤ UNO: ప్రతి 11 నిమిషాలకు.. ఒక యువతి బలి
Published date : 25 Nov 2022 01:33PM