Bilkis Bano Case: బిల్కిస్ కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనం
బాధితురాలిని గ్యాంగ్‌రేప్ చేసి ఆమె కుటుంబసభ్యులు ఏడుగురిని హత్య చేసిన దోషులకు వర్తింపజేసిన రెమిషన్(ముందస్తు విడుదల)ను వ్యతిరేకిస్తూ బిల్కిస్ తరఫున శోభా గుప్తా సుప్రీంకోర్టులో మార్చి 22న కేసును వాదించారు. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్ధివాలాల ధర్మాసనం విచారించింది. ‘ఈ అంశాన్ని విచారించేందుకు ప్రత్యేకంగా బెంచ్‌ను ఏర్పాటుచేస్తాం’ అని సీజేఐ చంద్రచూడ్ గుప్తాకు హామీ ఇచ్చారు.
ఈ కేసును వీలైనంత త్వరగా విచారించాలని ఫిబ్రవరి ఏడో తేదీనే బిల్కిస్ న్యాయవాది కోర్టును కోరగా అప్పటి నుంచీ ఈ కేసు కనీసం విచారణకు నోచుకోలేదు. ఫిబ్రవరి 24వ తేదీన విచారణకు వచ్చినా అదే బెంచ్‌లోని జడ్జీలు అనాయాస మరణానికి సంబంధించిన వేరే కేసును విచారించే ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉండటంతో ఈ విచారణ వీలుకాలేదు. యావజ్జీవ ఖైదీలను ముందస్తుగా విడుదల చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గుజరాత్ రాష్ట్ర సర్కార్ చెప్పడంతో అందుకు అనుమతిస్తూ కోర్టు సమ్మతి తెలపడంతో ఆ ఖైదీలు గత ఏడాది విడుదలయ్యారు.