Repo Rate: ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్‌బీఐ కీలక నిర్ణయం
ద్రవ్యోల్బణ కట్టడికి కేంద్ర బ్యాంక్ ఆర్‌బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కీలక నిర్ణయాలు తీసుకుంది. రెపోరేటు, క్యాష్ రిజర్వ్ రేషియో రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనంలో ఉన్నందున ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. కేంద్ర బ్యాంకు తాజా నిర్ణయం ప్రకారం– రెపోరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 4.40 శాతానికి పెరిగింది. ఈ పెంపు తక్షణమే (2022 మే 4) అమల్లోకి వస్తుందని తెలిపారు. క్యాష్ రిజర్వ్ రేషియో(సీఆర్‌ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు మే 21 నుంచి అమల్లోకి రానుంది. చివరి సారిగా 2018 ఆగస్టులో వడ్డీరేట్లు ఆర్‌బీఐ పెంచింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఎదురయ్యాయి. క్రమంగా ఈ పరిస్థితులు గాడిన పడుతున్న సమయంలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. యూరప్, అమెరికా సహా అనేక దేశాలు రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి. మరోవైపు అతి పెద్ద సరఫరాదారుగా ఉక్రెయిన్ లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆర్‌బీఐ సర్దుబాటు ధోరణికి స్వస్తి పలికి.. రెపో రేటు, క్యాష్ రిజర్వ్ రేషియో రేట్లను పెంచాలని నిర్ణయం తీసుకుంది. జూన్ లో ఆర్‌బీఐ సమావేశం జరగాల్సి ఉండగా.. ఒక నెల ముందుగానే అత్యవసర సమావేశం నిర్వహించింది. కీలక నిర్ణయాలను వెల్లడించింది.
RBI MPC Highlights: కీలక పాలసీ వడ్డీ రేటు అయిన రెపో రేటును ఎంత శాతం పెంచారు?
రెపో రేటు పెంపు.. ఎవరికి మేలు.. ఎవరికి భారం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యవసరంగా పెంచిన రెపోరేటు కొందరికి వరంగా మారగా.. మరికొందరికి భారంగా మారనుంది. బ్యాంకులకు ఆర్‌బీఐ విధించే వడ్డీరేటును రెపోరేటుగా పేర్కొంటారు. నిధుల కొరత ఏర్పడినప్పుడు బ్యాంకులు కేంద్రబ్యాంకు నుంచి అప్పుగా తీసుకుంటాయి. ఈ అప్పుకు విధించే వడ్డీని రెపోరేటుగా చెప్పుకోవచ్చు. ఆర్‌బీఐ రెపోరేటును పెంచితే బ్యాంకులు సైతం తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును పెంచుతాయి. రిజర్వ్ బ్యాంక్ రెపోరేటు పెంచడంతో హోంలోన్ , పర్సనల్ లోన్ , వెహికల్ లోన్ల వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఇప్పటికే పాత వడ్డీరేటుతో తీసుకున్న వారిపై కూడా ఈ పెంపు భారం పడనుంది. ఆర్‌బీఐ వడ్డీరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపోరేటు 4 శాతం నుంచి 4.40 శాతానికి పెరిగింది. దీని ప్రకారం పాత వడ్డీ రేటు 0.40 శాతం పెరుగుతుంది. కొత్తగా రుణం తీసుకునే వారు అధికంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.