Skip to main content

RBI MPC Highlights: కీలక పాలసీ వడ్డీ రేటు అయిన రెపో రేటును ఎంత శాతం పెంచారు?

RBI MPC

కీలక పాలసీ వడ్డీ రేటు అయిన రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పెంచింది. రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నట్లు మే 4న ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో రెపో రేటు 4 శాతం నుంచి 4.4 శాతానికి చేరింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్‌బీఐ పాలసీ రేటు పెంపు ఇది. ఈ ప్రభావంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఈఎంఐలు భారం కానున్నాయి. ఇక రివర్స్‌ రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా.. అంటే 3.35 శాతంగానే కొనసాగించింది.

GK International Quiz: మొక్కల ఆధారిత కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉపయోగించేందుకు అధికారం పొందిన మొదటి దేశం?

గడచిన 11 పాలసీ సమావేశాల్లో..
కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది. గడచిన 11 పాలసీ సమావేశాల్లో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్‌బీఐ కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్‌బీఐ కొనసాగిస్తూ వచ్చింది.

తాజా పెంపుకు కారణం..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌సహా కమోడిటీ ధరల తీవ్రత, వ్యవస్థ నుంచి ఈజీ మనీ ఉపసంహరణలో భాగంగా అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు వంటి పలు అంశాలు ఆర్‌బీఐ తాజా నిర్ణయానికి కారణమయ్యాయి. అలాగే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం కట్టుతప్పే పరిస్థితులు ఉత్పన్నం కావడం (ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య ఉండాలి) కూడా ఒక ప్రధాన కారణం. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆధ్వర్యంలో మే 2 నుంచి 4 వరకూ సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.4 శాతం, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనున్నాయి.

Exports: భారత్‌ నుంచి అత్యధిక ఎగుమతుల ఏ నెలలో నమోదయ్యాయి?

అర శాతం పెరిగి 4.5 శాతానికి సీఆర్‌ఆర్‌..
రెపో రేటుతో బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని కూడా ఆర్‌బీఐ ఎంపీసీ 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని కట్టడి చేసి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నది ఈ ఇన్‌స్ట్రమెంట్ల ప్రధాన ఉద్దేశ్యం. సీఆర్‌ఆర్‌ పెంపు వల్ల వ్యవస్థ నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వ్యవస్థ నుంచి వెనక్కు మళ్లుతాయన్నది అంచనా. కాగా ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) ఆర్‌బీఐ పాలసీ కమిటీ రెండవ ద్వైమాసిక ద్రవ్యపరపతి సమావేశం జూన్‌ 6వ తేదీ 8వ తేదీ మధ్య జరగనుంది.

రెపో, రివర్స్‌ రెపో రేటు అంటే ఏమిటీ?
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్‌ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
Digital Payments: దేశంలో రోజుకు ఎన్ని కోట్ల విలువైన డిజిటల్‌ లవాదేవీలు జరుగుతున్నాయి?​​​​​​​

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
ఆర్‌బీఐ రెపో రేటు 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంపు
ఎప్పుడు : మే 05
ఎవరు : ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌సహా కమోడిటీ ధరల తీవ్రత, రిటైల్‌ ద్రవ్యోల్బణం కట్టుతప్పే పరిస్థితులు ఉత్పన్నం కావడం వంటి అంశాల కారణంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 05 May 2022 06:35PM

Photo Stories