Mega Textiles Park: తెలంగాణలో టెక్స్‌టైల్ పార్కు.. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ఏర్పాటు
టెక్స్‌టైల్ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా 5 ఎఫ్ (ఫార్మ్–ఫైబర్–ఫ్యాక్టరీ–ఫ్యాషన్–ఫారిన్) దృష్టితో దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కులు నెలకొల్పనున్నట్టు మోదీ మార్చి 17న తెలిపారు. తెలంగాణలోని వరంగల్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్ (లక్నో), మధ్యప్రదేశ్ (ధార్), మహారాష్ట్ర (అమరావతి), తమిళనాడు(విరుదునగర్), కర్ణాటక (కల్బుర్గి), గుజరాత్ (నవ్‌సారీ)ల్లో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు కానున్నాయి.
ఒక్కో మెగా టెక్స్‌టైల్ పార్కు ద్వారా ప్రత్యక్షంగా ఒక లక్ష ఉద్యోగాలతో పాటు, పరోక్షంగా 2 లక్షలమందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉండనుంది. అంతేగాక ఒక్కో మెగా టెక్స్‌టైల్ పార్కు సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుందని కేంద్ర జౌళి శాఖ తెలిపింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేసే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు పనుల పర్యవేక్షణ జరుగనుంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
కాకతీయ మెగా టెక్స్‌టైల్‌కు ఊతం..
‘ఫైబర్ టు ఫ్యాబ్రిక్’ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలోని గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని 1200 ఎకరాల్లో ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు’ను ఏర్పాటు చేసింది. 2017లో ఈ మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేసిన టీఎస్‌ఐఐసీ ద్వారా కొంత మేర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులు కూడా జరిగాయి. అంతర్గత రహదారులు, విద్యుత్ తదితర వసతులను సమకూర్చడంతో యంగ్‌వన్, గణేశా ఈకో వంటి పెద్ద సంస్థలు తమ కార్యకలాపాలను కూడా ప్రారంభించాయి.
అయితే దీనికి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు రూ.897 కోట్లు ఇవ్వాలని గతంలో మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘పీఎం మిత్ర’టెక్స్ టైల్ పార్కు పథకంలో వరంగల్‌ను చేర్చడం ద్వారా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో కొత్తగా కాలుష్య శుద్ధీకరణ ప్లాంటు, ఇతర మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు.