Skip to main content

Most Polluted City In The World: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశ రాజధానిగా ఢిల్లీ.. వరుసగా నాలుగుసార్లు

 New Delhi Pollution    Most Polluted City In The World    Global Air Quality Report 2023  Pollution in Indian cities
Most Polluted City In The World

న్యూఢిల్లీ: ‘అత్యంత కాలుష్య దేశ రాజధాని’ అప్రతిష్ట కిరీటాన్ని ఢిల్లీ మరోసారి తన నెత్తిన పెట్టుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్‌ సంస్థ ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక–2023లో పలు అంశాలను ప్రస్తావించింది. నివేదికలో వెల్లడైన వివరాల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో నిండిన మెట్రోపాలిటన్‌ ప్రాంతంగా బిహార్‌లోని బెగుసరాయ్‌ నిలిచింది. ఘనపు మీటర్‌కు 54.4 మైక్రోగ్రామ్‌ల చొప్పున వార్షిక సూక్ష్మధూళికణాల(పీఎం 2.5) గాఢత ఉన్న దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. 79.9 మైక్రోగ్రామ్‌లతో బంగ్లాదేశ్‌ తొలిస్థానంలో, 73.7 మైక్రోగ్రామ్‌లతో పాకిస్థాన్‌ రెండోస్తానంలో నిలిచింది.

గత ఏడాది ఘనపు మీటర్‌కు కేవలం 53.4 మైక్రోగ్రామ్‌ల వార్షిక సూక్ష్మధూళి కణాల(పీఎం 2.5)గాఢతతో భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉండగా ఇటీవలికాలంలో దేశంలో కాలుష్యం విపరీతంగా కమ్ముకుని భారత స్థానం దారుణంగా మూడో స్థానానికి ఎగబాకడం ఆందోళనకరం. ఇక బిహార్‌లోని బెగుసరాయ్‌ గత ఏడాది కాలుష్యప్రాంతాల జాబితాలోనే లేదు. కానీ ఈ ఏడాది ఘనపు మీటర్‌కు 118.9 మైక్రోగ్రామ్‌ల పీఎం2.5 గాఢతతో ప్రపంచంలోనే అతి కాలుష్య మెట్రోపాలిటన్‌ పట్టణంగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఆ తర్వాతి స్థానాలో గువాహటి, ఢిల్లీ, పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్‌ నిలిచాయి.

నాలుగుసార్లు టాప్‌ ర్యాంక్‌
ఢిల్లీ పీఎం2.5 గాఢత గత ఏడాది 89.1 మైక్రోగ్రాములు ఉంటే ఈసారి మరికాస్త పెరిగి 92.7 మైక్రోగ్రాములకు చేరుకుంది. దీంతో విపరీతమై కాలుష్యం కారణంగా 2018 ఏడాది నుంచి చూస్తే నాలుగుసార్లు మోస్ట్‌ పొల్యూటెడ్‌ క్యాపిటల్‌ సిటీ కిరీటాన్ని ఢిల్లీకే కట్టబెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక ఘనపు మీటర్‌కు 5 మైక్రోగ్రాములకు మించి సూక్ష్మధూళి కణాలు ఉండకూడదు. కానీ భారత్‌లోని 136 కోట్ల ప్రజలు అధిక వాయుకాలుష్యం బారిన పడ్డారని తాజా నివేదిక ఘోషిస్తోంది. దేశ జనాభాలో 96 శాతం మంది అంటే 133 కోట్ల మంది డబ్ల్యూహెచ్‌వో పరిమితికి ఏడు రెట్లు మించి కాలుష్యమయ వాతావరణంలో జీవిస్తున్నారు. భారత్‌లోని 66 శాతం నగరాలు సగటున ఘనపు మీటర్‌కు 35 మైక్రోగ్రామ్‌ల ధూళికణాలున్న వాయుకాలుష్యం బారిన పడ్డాయి.

విభిన్న మార్గాల్లో, విస్తృతస్థాయి డేటా
ప్రపంచవ్యాప్తంగా 134 దేశాల్లో ఏర్పాటుచేసిన 30,000 వాయునాణ్యతా ప్రమాణాల స్టేషన్లు, సెన్సార్లు సేకరించిన డేటాను క్రోడీకరించి ఈ నివేదికను తయారుచేసినట్లు ఐక్యూఎయిర్‌ తెలిపింది. అధ్యయన సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వేతర లాభాపేక్షలేని సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, పౌర శాస్త్రవేత్తల నుంచి తీసుకున్న డేటాను ఈ నివేదిక కోసం వినియోగించినట్లు సంస్థ పేర్కొంది. 

ఆసియా ‘100’లో 83 భారత్‌లోనే
ప్రపంచవ్యాప్తంగా కాలుష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా భారత్‌ పేరుమోస్తోంది. ఆసియాలో అత్యంత కాలుష్యమయ 100 నగరాల జాబితా ప్రకటించగా అందులో 83 నగరాలు భారత్‌లో ఉండటం దారుణ పరిస్థితికి దర్పణం పడుతోంది. కొన్ని నగరాల్లో కాలుష్యం డబ్ల్యూహెచ్‌వో పరిమితిని పది రెట్లు దాటేయడం గమ నార్హం. కాలుష్యానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 7,800 నగరాలను పరిశీలిస్తే అందులో డబ్ల్యూహెచ్‌వో పరిమితికి లోబడి కేవలం 9 శాతం నగరాలు ఉండటం చూస్తే పరిస్థితి చేయిదాటిపోయిందని అర్ధమవుతోంది. ‘ ఫిన్లాండ్, ఎస్తోనియా, ప్యూర్టోరీకో, ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్, బెర్ముడా, గ్రెనెడా, ఐస్‌ల్యాండ్, మారిషస్, ప్రెంచ్‌ పాలినేసియా దేశాల్లో మాత్రం వాయు నాణ్యత బాగుంది.

Published date : 20 Mar 2024 12:28PM

Photo Stories