Monkeypox in India : దేశంలోనే తొలి మంకీపాక్స్ కేసు.. ! ఎక్కడంటే..?
కేరళలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి నాలుగు రోజుల క్రితం వచ్చిన ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అతడి నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ తెలిపారు.
వైరస్ సోకిన వ్యక్తితో..
యూఏఈలో మంకీపాక్స్ సోకిన వ్యక్తిని కలిసిన క్రమంలో అనారోగ్యానికి గురికాగా.. ఆసుపత్రిలో చేరినట్లు వీనా జార్జ్ తెలిపారు. బాధితుడిని ఐసోలేషన్‌కు తరలించి పరిశీలనలో ఉంచినట్లు చెప్పారు. ‘ఎలాంటి భయం అవసరం లేదు. మంకీపాక్స్‌కు వైద్యం ఉందని, వైరస్ సోకిన వ్యక్తితో కలిసిన వారికే వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. వైరాలజీ ల్యాబ్ నివేదిక తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. బాధితుడు దేశంలోకి వచ్చాక ఎవరినీ కలవలేదు.’ అని తెలిపారు ఆరోగ్య మంత్రి.
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు..
స్థానిక ల్యాబ్‌లో పరీక్షించగా బాధితుడికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే.. మరోమారు నిర్ధారించుకునేందుకు పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు నమూనాలు పంపించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత వేగంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడించారు. అయితే.. వ్యాధి లక్షణాలు బయటపడ్డాకే ఇతరులకు వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. జ్వరం, తలనొప్పి, ఫ్లూ వంటి లక్షణాలతో మొదలవుతుందన్నారు. వైరస్ సోకిన 5 నుంచి 21 రోజుల్లో బయపడుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అసలు మంకీపాక్స్ అంటే ఏమిటీ..?
స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్‌ఫెక్షన్ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ కనిపించింది.
దీని లక్షణాలు ఇవే..
జ్వరం, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం మంకీ పాక్స్ లక్షణాలు. ఇక, అకస్మాత్తుగా తీవ్రమైన దద్దుర్లు వచ్చినవారు, మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చినవారు, మంకీపాక్స్ సోకినవారితో సన్నిహితంగా మెలిగినవారు, వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆసుపత్రిలో చేరాలి. ఐసొలేషన్‌లో ఉండి చర్మంపై బుడగలు తొలిగిపోయి, పైపొర పూర్తిగా ఊడిపోయి, కొత్త పొర ఏర్పడే వరకు చికిత్సలు తీసుకోవాలి. ఈ వైరస్ ఇతరులకు సోకకుండా తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎలా వ్యాపిస్తుంది?:
తుంపర్ల ద్వారా, మంకీపాక్స్ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్‌పై పడుకున్నా సోకుతుంది.