Satya Nadella: డిజిటల్ ఇండియా విజన్‌కు సహకరిస్తాం.. సత్య నాదెళ్ల
జనవరి 5న ఢిల్లీలో ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. డిజిటల్ ఇండియా విజన్ మొత్తం ప్రపంచానికి వెలుగును చూపుతుందని ఉద్ఘాటించారు. దేశ యువత నూతన ఆలోచనలు భూగోళాన్ని ప్రభావితం చేయగలవని మోదీ ట్వీట్‌లో వివరించారు.
డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు
భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని నాదెళ్ల తెలిపారు. తమ దారిలోనే ఇతర కంపెనీలు సైతం నడుస్తాయని, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ‘ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సదస్సు’లో సత్య నాదెళ్ల పాల్గొన్నారు. భారతదేశ టెక్నాలజీ స్టోరీ విస్తరించడానికి సహకరిస్తామన్నారు. టెక్నాలజీలో భారత్ అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రశంసించారు.
బిర్యానీ.. సౌతిండియా ‘టిఫిన్’ కాదు: సత్య నాదెళ్ల
ఆధునిక కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే చాట్ రోబో ‘చాట్‌జీపీటీ’లో తనకు ఎదురైన అనుభవాన్ని సత్య నాదెళ్ల వివరించారు. దక్షిణ భారతదేశంలో బాగా పేరున్న టిఫిన్ల గురించి తాను అడగ్గా.. ఇడ్లి, దోశ, వడతోపాటు బిర్యానీ అంటూ చాట్‌జీపీటీ బదులిచ్చిందని అన్నారు. తాను హైదరాబాదీనని, తన పరిజ్ఞానాన్ని తక్కువ అంచనా వేయొద్దని, బిర్యానీ అనేది టిఫిన్ కాదని తాను గట్టిగా చెప్పడంతో చాట్‌జీపీటీ క్షమాపణ కోరిందని వెల్లడించారు.