Maharashtra Approves 10% Reservation Bill: విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్, బిల్ ఆమోదం
ముంబై: మహారాష్ట్రలో విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆ రాష్ట్ర శాసనసభ సంబంధిత బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఫిబ్రవరి 20న ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర అసెంబ్లీలో మహారాష్ట్ర రాష్ట్ర విద్య, సామాజిక వెనుకబాటు బిల్లు–2024ను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే ప్రవేశపెట్టారు.
ఓబీసీ కోటాలో కాకుండా విడిగా మరాఠాలకు రిజర్వేషన్
రాష్ట్రజనాభాలో మరాఠాలు 28 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో మరాఠాలకు అమలయ్యే 10 శాతం రిజర్వేషన్‌ను పదేళ్ల తర్వాత సమీక్షిస్తారు. ‘‘రాష్ట్రంలో భిన్న కులాలు, వర్గాలకు ఇప్పటికే 52 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇందులోనే ఓబీసీలకు19 శాతం రిజర్వేషన్ కలిసి ఉంది. అంటే దేశంలో పరిమిత 50 శాతం మార్కును దాటి రిజర్వేషన్లు అమలవుతున్నాయి’’ అని బిల్లులో పేర్కొన్నారు.
‘‘తమిళనాడులో 69 శాతం, హరియాణాలో 67 శాతం, రాజస్థాన్‌లో 64 శాతం, బిహార్‌లో 69 శాతం, గుజరాత్‌లో 59 శాతం, పశ్చిమబెంగాల్‌లో 55 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఓబీసీ కోటాలో కాకుండా రాష్ట్రంలో మరాఠాలకు విడిగా రిజర్వేషన్ ఇస్తున్నాం’’ అని సీఎం అన్నారు. వ్యవసాయ ఆధారిత కుంబీ కులానికి చెందిన మరాఠాలకు, వారి రక్తసంబంధీలకు మాత్రమే కుంబీ కుల ధ్రుజీవీకరణ పత్రమిస్తామని ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొంది.