Skip to main content

Parliament: సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

వివాదస్పద మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు నవంబర్‌ 29న మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదం తెలిపింది. 2020 ఏడాది కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొంతకాలంగా కొన్ని రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Parliament

మూడు సాగు చట్టాలు–వివరాలు

  • 2020, జూన్‌ 5 : మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేసింది.
  • 2020, సెప్టెంబరు 14–22: ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడం, పెద్దగా చర్చలేకుండా లోక్‌సభ, రాజ్యసభలు మూజువాణి ఓటుతో ఆమోదించడం జరిగిపోయింది.
  • 2020, సెప్టెంబర్‌ 27: రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చి అమలులోకి వచ్చాయి.
  • 2021, జనవరి 12: ఈ చట్టాల రద్దు కోరుతూ అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో... సుప్రీంకోర్టు ఈ మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై ‘స్టే’ విధించింది.

1. ది ఫార్మర్స్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌– ఎఫ్‌పీటీసీ) యాక్ట్‌

రైతులు తమ ఉత్పత్తుల ప్రాంతీయ వ్యవసాయ మార్కెట్లలో కాకుండా... వాటి పరిధిని దాటి దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకొనే స్వేచ్ఛను కల్పించింది. అధికధరలు ఎక్కడ లభిస్తే అక్కడ విక్రయించుకోవచ్చు. ఎక్కడి వ్యాపారులైనా... ఎక్కడికైనా వచ్చి పంట ఉత్పత్తులను కొనొచ్చు. రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చట్టాలను నిర్వీర్యం చేసింది. మార్కెట్‌ కమిటీలు వసూలు చేసే సెస్‌ను రద్దు చేసింది.

2. ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆఫ్‌ ప్రైస్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ యాక్ట్, 2020
ఒప్పంద వ్యవసాయానికి (కాంట్రాక్టు ఫార్మింగ్‌) ఇది చట్టబద్ధతను చేకూర్చింది. వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి ముందు రైతులు ఫలానా ధరకు తమ పంటను అమ్ముతామని కొనుగోలుదారుతో నేరుగా ఒప్పందం చేసుకోవచ్చు. అయితే కొనుగోలుదారులు రైతులకు ఏ పంటకు ఎంత కనీస మద్దతు ధర చెల్లించాలనేది ఈ చట్టంలో ప్రస్తావన లేదు.

3. నిత్యావసర వస్తువుల సవరణ చట్టం–2020
నిత్యావసర వస్తువుల నిల్వల పరిమితిపై ఇదివరకున్న ఆంక్షలను ఈ చట్టం ఎత్తివేసింది. అసాధారణ, అత్యయిక పరిస్థితులు తలెత్తితే తప్ప నిత్యావసర వస్తువుల నిల్వలపై ఆంక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకుండా చేసింది. వంటనూనెలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల తదితర ఆహార వినియోగవస్తువులను నిత్యావసరాల జాబితాలో నుంచి తొలగించింది. ఉద్యానపంటల ధరలు రిటైల్‌ మార్కెట్లో 100 శాతం పెరిగితే, ఆహారధాన్యాల ధరలు 50 శాతానికి పైగా పెరిగితేనే వ్యాపారులు, హోల్‌సేలర్ల వద్ద సదరు సరుకులు నిల్వలపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పరిమితులు విధించడానికి ఈ చట్టంలో వీలుకల్పించారు.

కొందరు ప్రముఖులు..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో కొందరు ప్రముఖుల వివరాలు ఇలా..
1. రాకేశ్‌ తికాయత్‌: భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధికార ప్రతినిధి. 52 ఏళ్ల వయసున్న ఒకప్పుడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేశారు.
2. దర్శన్‌పాల్‌: అఖిల భారత సంఘర్ష్‌ సమన్వయ కమిటీ సభ్యుడు. వృత్తిరీత్యా డాక్టర్‌.
3. జోగిందర్‌  సింగ్‌ ఉగ్రహాన్‌: భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఉగ్రహాన్‌) అధ్యక్షుడు. ఒకప్పుడు ఆర్మీలో పని చేశారు.
4. బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌: భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అధ్యక్షుడు. వయసు 78 ఏళ్లు. మాజీ సైన్యధికారి.
5. సుఖ్‌దేవ్‌ సింగ్‌ కొక్రికలన్‌: బీకేయూ, ఉగ్రహాన్‌ ప్రధాన కార్యదర్శి. వయసు 71 సంవత్సరాలు. స్కూలు టీచర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. 
చ‌ద‌వండి: భార‌త‌ రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్‌ 29
ఎవరు    : లోక్‌సభ
ఎందుకు : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 29 Nov 2021 01:51PM

Photo Stories