Same Sex Marriage: స్వలింగ వివాహాలు చట్ట విరుద్ధమే!
ఇలాంటి వివాహాలను చట్టబద్ధంగా గుర్తించడం అనేది వ్యక్తిగత చట్టాలు, ఆమోదయోగ్యమైన సామాజిక విలువల మధ్య సమతూకాన్ని దెబ్బతీస్తుందని వెల్లడించింది. అందుకే చట్టబద్ధత కల్పించలేమని వివరించింది. స్వలింగ వివాహాలు ముమ్మాటికీ చట్టవిరుద్ధమేనని పరోక్షంగా తేల్చిచెప్పింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం మార్చి 13న విచారణ చేపట్టనుంది. ఐపీసీ సెక్షన్ 377 కింద స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చినప్పటికీ.. స్వలింగ వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించడాన్ని ప్రాథమిక హక్కుగా పిటిషనర్లు కోరలేరని స్పష్టం చేసింది. స్త్రీ–పురుషుడి సంబంధాలు, వేర్వేరు వ్యక్తుల నడుమ వ్యక్తిగత అవగాహనతో ఏర్పడే సంబంధాలు చట్టవ్యతిరేకం కాదని అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది.
స్వలింగ సంపర్కుల సహజీవనం నేరం కాదు
ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు పురుషుల నడుమ జరిగిన పెళ్లికి వ్యక్తిగత చట్టాలు లేదా రాజ్యాంగబద్ధమైన చట్టాల కింద చట్టబద్ధత కల్పించడం, గుర్తించడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. స్వలింగ సంపర్కులు కలిసి జీవించడం నేరం కాదని వెల్లడించింది. కానీ, దీన్ని భార్య, భర్త, పిల్లలతో కూడిన భారతీయ కుటుంబ యూనిట్‌తో పోల్చలేమని కేంద్రం అభిప్రాయపడింది. ఒక వేళ స్వలింగ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే అది ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత చట్టాలను, నోటిఫైడ్ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని వివరించింది.