Winter Parliament Session 2023: సీఈసీ, ఈసీల నియామకాల బిల్లుకు ప్రధానమంత్రి ప్యానెల్.. ఈ బిల్లులో ఏముందంటే..?
చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్‌మెంట్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు–2023ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. స్వల్పకాలిక చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును డిసెంబర్ 12న రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే బిల్లును తీసుకొచ్చినట్లు అర్జున్‌రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రకటించారు. ఈసీసీ, ఈసీల సరీ్వసు నిబంధనలకు సంబంధించి 1991 నాటి చట్టంలో కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తూ కొత్త బిల్లును రూపొందించినట్లు తెలియజేశారు. ప్రతిపాదిత కొత్త చట్టం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు.
సీఈసీ, ఈసీల నియామకానికి చట్టాన్ని తీసుకొచ్చేవరకూ ముగ్గురు సభ్యులతో ఒక ప్యానెల్ ఏర్పాటు చేయాలని ఈ ఏడాది మార్చి నెలలో ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించిందని అన్నారు. ఈ ప్యానెల్‌లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని పేర్కొందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే బిల్లును తయారు చేసినట్లు స్పష్టం చేశారు. రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల విభజనకు అనుగుణంగా రూపొందించామని అన్నారు. అలాగే సీఈసీ, ఈసీల హోదా, వేతనాలకు సంబంధించిన సవరణలను కూడా బిల్లులో పొందుపర్చారు.
CEC and EC Bill 2023: సీఈసీ, ఈసీల బిల్లు-2023కు రాజ్యసభ ఆమోదం
బిల్లులో ఏముంది..?
► ప్రస్తుతం సీఈసీ, ఈసీలను కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమిస్తున్నారు.
► సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీఈసీ, ఈసీల నియామకం ఇకపై ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్యానెల్ పరిధిలోకి రానుంది. అంటే కార్యనిర్వాహక వర్గమే సీఈసీ, ఈసీలను నియమిస్తుంది.
► బిల్లు చట్టంగా మారిన తర్వాత సీఈసీ, ఈసీల నియామకం కోసం కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో సెర్చ్ కమిటీని ఏర్పాటు ఏయాల్సి ఉంటుంది. ఇందులో ఇద్దరు కేంద్ర కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. సీఈసీ, ఈసీల నియామకం కోసం ఐదుగురి పేర్లతో షార్ట్‌లిస్టు తయారు చేసి సెలక్షన్ కమిటీకి పంపించాలి.
► ఆ తర్వాత ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్ ఎన్నికల సంఘం సభ్యులను ఎంపిక చేస్తుంది.
► ఒకవేళ లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేకపోతే సభలోని ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడిని సెలక్షన్ ప్యానెల్‌లో సభ్యుడిగా నియమిస్తారు.
► సెర్చ్ కమిటీ సూచించిన షార్ట్‌లిస్టులో లేని పేర్లను కూడా పరిగణనలోకి తీసుకొనే అధికారం ప్యానెల్‌కు ఉంటుంది.
► సవరించిన బిల్లు ప్రకారం.. సీఈసీ, ఈసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమాన హోదా లభిస్తుంది.
Jammu and Kashmir Reservation Bill: జమ్మూ కశ్మీర్ బిల్లులను ఆమోదించిన లోక్‌సభ
► సీఈసీ, ఈసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా వేతనం చెల్లిస్తారు.
► అధికారిక విధులు నిర్వర్తించే క్రమంలో సీఈసీ, ఈసీలకు కోర్టు కేసుల నుంచి రక్షణ కల్పిస్తూ సవరణ బిల్లులో కొన్ని అంశాలు చేర్చారు.
► సీఈసీ సిఫార్సు లేకుండా ఈసీలను పదవి నుంచి తొలగించడానికి వీల్లేదు.
► సుప్రీంకోర్టు జడ్జిని పదవి నుంచి తొలగించడానికి ఉపయోగించే ప్రక్రియనే సీఈసీ విషయంలోనూ ఉపయోగించాలి.
► సెక్రెటరీ ర్యాంకు లేదా సమాన హోదా ఉన్నవారిని మాత్రమే సీఈసీ, ఈసీలుగా నియమించాలి.
► సీఈసీ, ఈసీలపై గతంలోనే కేసులు ఉంటే.. వారు పదవుల్లో ఉన్నంతకాలం ఆయా కేసుల్లో విచారణ కొనసాగించకూడదు. గతంలో సీఈసీ రాజీవ్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన స్పెషల్ సెషన్స్ జడ్జిని తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పదవుల్లో ఉన్న సీఈసీ, ఈసీలపై విచారణ కొనసాగించకూడదన్న నిబంధననను బిల్లులో చేర్చారు.