Skip to main content

Supreme Court: కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదు

ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉండగా మరణిస్తే అతని/ఆమె డిపెండెంట్‌కు కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
Supreme Court of India
Supreme Court of India

ఇటువంటి సందర్భాల్లో మరణించిన వ్యక్తి కుటుంబం ఆర్థిక స్థితిగతులు, అతడు/ఆమెపై ఆ కుటుంబంలోని వారు ఏ మేరకు ఆధారపడ్డారు, వారు వృత్తి, వ్యాపారాల్లో కొనసాగుతున్నారా వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కారుణ్యనియామకాన్ని చేపట్టాల్సి ఉంటుందని జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ల  సుప్రీంకోర్టు  ధర్మాసనం డిసెంబర్‌ 16వ తేదీన స్పష్టం చేసింది. సర్వీస్‌ నిబంధనల్లో కారుణ్య నియామకం కూడా ఒక్కటై, ఉద్యోగి మరణించిన సందర్భాల్లో ఆటోమేటిక్‌గా, ఎలాంటి పరిశీలనలు జరపకుండా కారుణ్య నియామకం చేపడితే అది సంపూర్ణ చట్టబద్ధ హక్కు అవుతుందని  సుప్రీంకోర్టు  తెలిపింది. ‘కానీ, ప్రస్తుతం కారుణ్య నియామకం అలా కాదు. అది వివిధ పరామితులకు లోబడి ఉంటుంది. చనిపోయిన ఉద్యోగి కుటుంబం ఆర్థిక పరిస్థితులు, ఆ కుటుంబం ఏమేరకు ఆ మృత ఉద్యోగిపై ఆధారపడి ఉంది, వారు సాగిస్తున్న వివిధ వృతులు, ఉద్యోగాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని  సుప్రీంకోర్టు  పేర్కొంది. ఈ మేరకు భీమేశ్‌ అనే వ్యక్తికి కారుణ్య కారణాలతో ఉద్యోగం ఇవ్వాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన‌ ఆదేశాలను పక్కన బెడుతూ  సుప్రీంకోర్టు  ధర్మాసనం తీర్పు వెలువరించింది. భీమేశ్‌ సోదరి కర్ణాటక ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్‌ టీచర్‌గా పనిచేస్తూ 2010లో చనిపోయారు. అవివాహిత అయిన ఆమెకు తల్లి, ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. సోదరి ఆదాయంపై తమ కుటుంబం ఆధారపడి ఉన్నందున తనకు కారుణ్య కారణాలతో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటూ భీమేశ్‌ వాదించగా అధికారులు తిరస్కరించారు. దీంతో, ఆయన అడ్మినిస్టేటివ్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లగా తీర్పు అనుకూలంగా వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ వేయగా, ట్రిబ్యునల్‌ తీర్పునే కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో, ఆ రాష్ట్ర విద్యాశాఖ తాజాగా సుప్రీంకోర్టు తలుపుతట్టింది.

Published date : 17 Dec 2021 05:02PM

Photo Stories