CJI Justice Chandrachud: న్యాయవ్యవస్థలో పురుషాధిక్యత
నవంబర్ 12న ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. మహిళలు, సమాజంలోని అణగారిన వర్గాల వారు న్యాయపాలికలోకి మరింత పెద్ద సంఖ్యలో ప్రవేశించాలని అభిప్రాయపడ్డారు. అందుకు వీలుగా మొత్తం న్యాయ వ్యవస్థను మరింత ప్రజాస్వామ్యయుతంగా, ప్రతిభాధారితంగా మార్చాల్సిన అవసరం చాలా ఉందంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థకు మానవ వనరులను అందించేందుకు మనకు ఒక నిర్ధారిత వ్యవస్థ ఉంది. దాని నిర్మాణం ఇప్పటికీ ఫ్యూడల్, పితృస్వామ్య పోకడలతోనే నిండి ఉందన్నది వాస్తవం. పురుషాధిక్యత మన న్యాయవ్యవస్థ స్వరూపంలోనే గూడుకట్టుకుపోయింది.
Also read: Supreme Court: మతం మారిన దళితులకు ఎస్సీ హోదాపై అధ్యయనం
సీనియర్ లాయర్లున్న ఏ చాంబర్లోకి వెళ్లినా అక్కడ మొత్తం పురుషులే కనిపిస్తారు. మార్పు అక్కడి నుంచే రావాలి. మహిళలు, అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులకు ఆ చాంబర్లలో చోటు దక్కాలి. అప్పుడు గానీ న్యాయపాలికలో వారి సంఖ్య పెరగదు! మహిళా న్యాయవాదులు, న్యాయమూర్తుల ద్వారానే భవిష్యత్తులో మెరుగైన న్యాయవ్యవస్థను నిర్మించుకోగలం’’ అన్నారు. ‘‘నేడు న్యాయవ్యవస్థ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. వాటిలో మొట్టమొదటిది, అతి ముఖ్యమైనది సుప్రీంకోర్టుపై ప్రజలు పెట్టుకున్న ఆశలు. ఎందుకంటే ప్రతి సామాజిక, న్యాయపరమైన అంశమూ, రాజకీయ అంశమూ సుప్రీంకోర్టు న్యాయ పరిధిలోకి వచ్చేవే’’ అని చెప్పారు.
న్యాయమూర్తులకు ఆ నేర్పుండాలి
చట్టం అణచివేతకు సాధనంగా కాక న్యాయమందించే సాధనంగా ఉండాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యత పాలకులదే తప్ప న్యాయమూర్తులది కాదని స్పష్టం చేశారు. ‘‘మాపై ప్రజలకు ఎన్నో ఆశలు, అంచనాలున్నాయి. కానీ కోర్టుల పరిమితులను కూడా అర్థం చేసుకోవాలి. ‘‘చట్టాలు, న్యాయం కొన్నిసార్లు ఒకే సరళరేఖపై వెళ్లకపోవచ్చు. కానీ చట్టాలున్నది అంతిమంగా న్యాయ వితరణకే. వాటిని అణచివేతకు దురి్వనియోగం చేయొద్దు’ అని సీజేఐ అన్నారు. ‘‘దీర్ఘకాలంలో న్యాయవ్యవస్థను నిలబెట్టేది దయా భావన, సహానుభూతితో ప్రజల వేదనను పోగొట్టగలిగిన సామర్థ్యం మాత్రమే. ఎవరూ పట్టించుకోని అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా బ్యాలెన్స్ చేయగలిగిన నాడు న్యాయమూర్తిగా బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్టు లెక్క’’ అన్నారు
అమెరికాతో పోలికేల...?
మన సుప్రీంకోర్టును అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల అత్యున్నత న్యాయస్థానాలతో పోల్చడం సరికాదని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘అమెరికా సుప్రీంకోర్టు ఏడాదంతా కలిపి మహా అయితే 180 పై చిలుకు కేసులు పరిష్కరిస్తుంది. బ్రిటన్‌లోనైతే 85 కేసులు దాటవు! కానీ మన సుప్రీంకోర్టులో ప్రతి న్యాయమూర్తీ సోమ, శుక్రవారాల్లో 75 నుంచి 80 కేసుల దాకా ఆలకిస్తారు. మంగళ, బుధ, గురువారాల్లో 30 నుంచి 40 దాకా కేసులు చూస్తారు. మన సుప్రీంకోర్టు విస్తృతి అంత సువిశాలమైనది! మేం పరిష్కరించే చాలా ముఖ్యమైన కేసుల్లో కొన్ని వార్తాపత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో కని్పంచకపోవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా పెన్షన్, భరణం వంటి చిన్నాచితకా కేసులనూ విచారించాల్సిందేనా అంటే, అవునన్నదే నా సమాధానం. ఎందుకంటే ప్రజలకు నిజమైన భరోసా కలి్పంచగలిగినప్పుడే న్యాయ వ్యవస్థ
పరిఢవిల్లుతుంది’’ అన్నారు.
Also read: EWS కోటా చెల్లుతుంది... చరిత్రాత్మక తీర్పు వెలువరించిన Supreme Court..
..అందుకే ప్రత్యక్ష ప్రసారాలు
రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాల్లో ఒక్కోసారి పారదర్శకత లేమి పెద్ద ప్రమాదంగా మారుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. దానికి అడ్డుకట్ట వేసేందుకే సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారానికి తెర తీసినట్టు చెప్పారు. తద్వారా న్యాయపాలికలో ఏం జరుగుతోందనే పౌరులు తెలుసుకునే అవకాశం దక్కడమే గాక న్యాయవ్యవస్థ మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు వీలు కలుగుతుందన్నారు. ‘‘కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలు మేం చేపట్టిన ఓ నూతన ప్రయోగం. న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంలో టెక్నాలజీ ఎంత పాత్ర పోషించగలదో దీని ద్వారా అర్థమైంది. న్యాయం కోసం సామాన్యుడు తొలుత ఆశ్రయించే జిల్లా కోర్టుల విచారణలనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలి’’ అన్నారు.
‘సోషల్’ సవాలుకు తగ్గట్టు అప్‌డేట్ కావాలి
‘‘కోర్టు గదిలో న్యాయమూర్తులు మాట్లాడే ప్రతి చిన్న మాటనూ రియల్ టైంలో రిపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా పెను సవాలుగా విసురుతోంది. న్యాయమూర్తుల పనితీరు నిత్యం మదింపుకు గురవుతోంది’’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘మనమిప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. కనుక న్యాయమూర్తులుగా మనల్ని మనం నిత్యం కొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఈ కొత్త తరపు సవాళ్లను ఎదుర్కోవడంలో మన పాత్రపై పునరాలోచించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి’’ అని పిలుపునిచ్చారు.
Also read: Supreme Court: స్థానిక సహకార సంఘాలకు 97వ రాజ్యాంగ సవరణ వర్తించదు
మేము మానసికంగా పక్కా యూత్!
న్యాయమూర్తులు నల్లకోటుతో పాత, రాచరిక కాలపు వస్త్రధారణలో కని్పంచి బోరు కొట్టిస్తుంటారని సీజేఐ అన్నారు. ‘‘మా లుక్స్ జనాలకు బాగా విసుగు పుట్టిస్తాయన్నది నిజమే కావచ్చు. కానీ నిజానికి మానసికంగా మాత్రం మేమంతా నవ యవ్వనంతో ఉరకలేస్తుంటాం’’ అంటూ చమత్కరించారు!
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP