Skip to main content

CJI DY Chandrachud: అయోధ్య భూ వివాదం, వ్యక్తిగత గోప్యత హక్కు, శబరిమల చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు

సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుల సేవే తన తొలి ప్రాథమ్యమని భారత నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధనంజయ యశ్వంత్‌ చంద్రచూడ్‌ (62) పేర్కొన్నారు.
Justice DY Chandrachud takes oath as India's 50th Chief
Justice DY Chandrachud takes oath as India's 50th Chief

‘టెక్నాలజీ కావచ్చు, న్యాయ సంస్కరణలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ప్రతి అంశంలోనూ సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణకే అగ్రతాంబూలమిస్తా’’ అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నవంబర్ 9న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. నవంబర్ 8న సీజేఐగా రిటైరైన జస్టిస్‌ యు.యు.లలిత్‌ నుంచి జస్టిస్‌ చంద్రచూడ్‌ బాధ్యతలు స్వీకరించారు. దైవసాక్షిగా ఆంగ్లంలో ప్రమాణం చేశారు. 

Also read: Quiz of The Day (November 09, 2022) : ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా స్పీకర్?

జస్టిస్‌ చంద్రచూడ్‌ 2024 నవంబరు 10 దాకా రెండేళ్లపాటు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 16వ సీజేఐగా చేసిన ఆయన తండ్రి జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ 1978 నుంచి 1985 దాకా ఏకంగా ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉండటం విశేషం. అత్యధిక కాలం సీజేఐగా ఉన్న రికార్డు ఆయనదే. తర్వాత 44 ఏళ్లకు ఆయన కుమారుడు చంద్రచూడ్‌ సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి కుమారులిద్దరూ సీజేఐ కావడం దేశంలో ఇదే తొలిసారి. జస్టిస్‌ చంద్రచూడ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అభినందించారు. ఆయన పదవీకాలం ఫలవంతంగా సాగాలంటూ వారిద్దరూ ట్వీట్‌ చేశారు.

జస్టిస్‌ చంద్రచూడ్‌ 1959 నవంబర్‌ 11న జన్మించారు. బీఏ ఆనర్స్‌ (ఎకనామిక్స్‌) అనంతరం ఢిల్లీ వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేశారు. అమెరికాలోని హార్వర్డ్‌ లా స్కూల్‌ నుంచి ఎల్‌ఎల్‌ఎం, డాక్టరేట్‌ ఇన్‌ జ్యూరిడికల్‌ సైన్సెస్‌ (ఎస్‌జేడీ) చేశారు. ఆయన ప్రస్థానం 1998లో బాంబే హైకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌గా మొదలైంది. బాంబే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్‌ చేశారు. అదే ఏడాది అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. 2013 నుంచి మూడేళ్లపాటు అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2016 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.

Also read: Chief Justice: వాగ్దానాలు కొంతవరకు నెరవేర్చా వీడ్కోలు సభలో సీజేఐ యు.యు.లలిత్‌

చరిత్రాత్మక తీర్పులు 
అయోధ్య భూ వివాదం, వ్యక్తిగత గోప్యత హక్కు, శబరిమలకు రుతుక్రమ మహిళల ప్రవేశం, అవివాహితలకూ 24 వారాల దాకా అబార్షన్‌ హక్కు తదితర కేసుల్లో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఆర్మీలో మహిళా ఆఫీసర్లకు పరి్మనెంట్‌ కమిషన్, కమాండ్‌పోస్టింగులు ఇవ్వాల్సిందేనని ఆయన సారథ్యంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇటీవల జస్టిస్‌ యు.యు.లలిత్‌ హయాంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో కొలీజియం సభ్యుల అభిప్రాయాల సేకరణకు సర్క్యులేషన్లు జారీ చేసే పద్ధతిని వ్యతిరేకించిన ఇద్దరు న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు.

Also read: EWS కోటా చెల్లుతుంది... చరిత్రాత్మక తీర్పు వెలువరించిన Supreme Court..

అసమ్మతిని స్వాగతిస్తారు 
అసమ్మతిని ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా జస్టిస్‌ చంద్రచూడ్‌ అభివర్ణిస్తుంటారు. ఆధార్‌ చెల్లుబాటును ఆయన చాలా గట్టిగా వ్యతిరేకించిన తీరు చాలాకాలం పాటు వార్తల్లో నిలిచింది. ఆధార్‌ చెల్లుతుందంటూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో మిగతా నలుగురు వెలువరించిన తీర్పుతో తీవ్రంగా విభేదించారు. యునిక్‌ బయోమెట్రిక్‌ గుర్తింపు సంఖ్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. న్యాయప్రక్రియను డిజిటైజ్‌ చేయడంలోనూ ఆయనది కీలకపాత్ర. ప్రగతిశీల భావాలున్న న్యాయమూర్తి అని, ఏ అంశం మీదైనా స్పష్టమైన భావాలు కలిగి ఉంటారని, వాటిని అంతే సూటిగా వ్యక్తీకరిస్తారని పేరు.  

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 10 Nov 2022 03:16PM

Photo Stories