Supreme Court Judgments: అందరికీ అందుబాటులో సుప్రీంకోర్టు తీర్పులు
డిజిటలైజేషన్ దిశగా సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది. గతంలో కోర్టు ఇచ్చిన వేల తీర్పు కాపీలు అందరికీ అందేలా ‘ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్(ఈ–ఎస్ సీఆర్) ప్రాజెక్టు’ ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఏడాది తొలి పనిదినమైన సోమవారం(జనవరి 2న) సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఇప్పటివరకు వెలువరించిన తీర్పుల కాపీలు ఇక నుంచి ఈ ప్రాజెక్టులో భాగంగా అందరికీ అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. ఈ తీర్పులన్నీ సుప్రీంకోర్టు వెబ్ సైట్, మొబైల్ యాప్‌తోపాటు జడ్జిమెంట్ పోర్టల్ అయిన నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ లో ఈ ఏడాది జనవరి 1 నుంచి అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటిని ఎవరైనా చూడవచ్చని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని పూర్తిగా ఉచితమని తెలిపారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP